'రాజస్థానీ' ఎన్నికల తలపాగా కట్టి మణిపూర్ పై మోదీ మాట
ప్రధాని నరేంద్ర మోదీ వస్త్రధారణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు
ప్రధాని నరేంద్ర మోదీ వస్త్రధారణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖరీదు ఎక్కువో కానీ.. తక్కువో కానీ.. ఆయన వస్త్రధారణ చాలా బాగుంటుంది. మంచి దుస్తులు వేసుకోవడం వేరు.. వేసుకున్న దుస్తులు అందరినీ ఆకట్టుకోవడం వేరు.. మోదీ మంచి దుస్తులు వేసుకుని అందరినీ ఆకట్టుకుంటారు. 73 ఏళ్ల వయసులో ఇది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ.. మొదటినుంచి డ్రెస్ సెన్స్ ఉన్న మోదీ గురించి తొలుత గుజరాత్ రాష్ట్రానికే తెలుసు. ప్రధాని అయ్యాక దేశమంతటికీ ఆయన వస్త్రధారణ శైలి తెలిసింది.
విమర్శలను పక్కనపెడితే మోదీ డ్రెస్ సెన్స్ ను మెచ్చుకోవాలి. ప్రఖ్యాత డిజైనర్లు డిజైన్ చేశారా? అన్నంట్లుగా ఉంటుంది ఆయన దుస్తుల ఎంపిక. ఇక ఆరోపణల విషయానికి వస్తే.. మోదీ అన్ని సందర్భాల్లోనూ ఆడంబర వస్త్రధారణకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా సంప్రదాయ దుస్తులు/వేషధారణతో కనిపిస్తారని ప్రత్యర్థులు అంటుంటారు. ఇందులో వాస్తవం ఉంది కూడా.
గణతంత్ర దినోత్సవంలో అలా..
ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు మోదీది ఏ రాష్ట్ర ఎన్నికలకు ఆ రాష్ట్ర వస్త్రధారణ అని విపక్షాలు విమర్శిస్తుంటాయి. గణతంత్ర దినోత్సవాన ఉత్తరాఖండ్ సంప్రదాయ టోపీతో కనిపించారు. గతంలో మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికల సందర్భంగా ఇలానే చేశారు. ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల ముందు ఉత్తరాఖండ్ సంప్రదాయ టోపీ, మణిపూర్ స్టోల్ తో గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. పంజాబ్ ఎన్నికల ముంగిట సర్దార్జీ వేషం కట్టారు. మిగతా సమయాలు, ఎన్నికల వేళలో ఎలా ఉన్నప్పటికీ.. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రధాని దేశాన్ని ఉద్దేశించి చేసే కీలక ప్రసంగంలోనూ ఇలాంటి వస్త్రధారణతో కనిపించడం విమర్శలకు తావిస్తోంది.
ఈ సారి రాజస్థానీ..
ప్రస్తుతం ఎన్నికల ఏడాది. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆపై ఏపీ సహా లోక్ సభ ఎన్నికలున్నాయి. ఇందులో రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్ కు అధికారం కోల్పోయిందా పార్టీ. కాగా, మంగళవారం నాటి పంద్రాగస్టు వేడుకలకు మోదీ రంగురంగుల రాజస్థానీ బంధాని ప్రింట్ టర్బన్ తో పాటు ఆఫ్-వైట్ కుర్తా ధరించి హాజరయ్యారు. తలపాగాతో నలుపు రంగు వీ నెక్ జాకెట్ కూడా ధరించారు. రాజస్థాన్ ఎన్నికల ముంగిట మోదీ ఇలా చేయడం కేవలం ఎన్నికల కోణమేనని ఆయన విమర్శకులు నోటికి పనిచెప్పారు.
మణిపూర్ పై గొంతు విప్పారు..
మూడు నెలలుగా రగులుతున్న మణిపూర్ రాష్ట్రం గురించి మోదీ తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. గతంలో మణిపూర్ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ప్రజలు ధరించే స్టోల్ తో జాతీయ వేడుకల్లో పాల్గొన్న మోదీ.. మణిపూర్ గురించి పార్లమెంటులో ప్రకటన చేయాలనే డిమాండ్ ప్రతిపక్షాల నుంచి గట్టిగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, పార్లమెంటు ప్రారంభానికి ముందు పొడిపొడిగా మీడియా సమావేశంలో మణిపూర్ గురించి, అవిశ్వాసం తీర్మానంలోనూ అంతే స్థాయిలో స్పందించిన మోదీ ఈసారి మాత్రం ఎర్రకోట వేదికగా మణిపూర్ గురించి ప్రస్తావించారు. అయితే, ''దేశ ప్రజలంతా మణిపూర్ కు అండగా ఉన్నారు'' అని అంటూ.. అక్కడ మహిళలు, యువతులపై జరిగిన హింసను పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో శాంతి నెలకొంటున్నదని చెప్పుకొచ్చారు.