బడ్జెట్ లో మాల్దీవులకు సాయం.. మేధావులు ఇప్పుడేమంటారు?

తన బడ్జెట్ తో మేధావులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షాకిచ్చారా? అంటే కొంతమేర అవునని చెప్పాలి

Update: 2024-02-02 06:33 GMT

తన బడ్జెట్ తో మేధావులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షాకిచ్చారా? అంటే కొంతమేర అవునని చెప్పాలి. విదేశీ వ్యవహారాల విషయంలో తనదైన మార్కు వేస్తున్న మోడీని అభినందించే వారు ఎంతమంది ఉంటారో.. అదే స్థాయిలో మరికొందరు మోడీ తీరును తప్పు పట్టేటోళ్లు ఉంటారు. సామాన్యుల కంటే మేధావులుగా పేర్కొనే పలువురు మోడీ సర్కారు అనుసరించే విదేశాంగ తీరుపై పెదవి విరుస్తూ ఉంటారు. వారిలో ఎక్కువగా వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉండేవారే కనిపిస్తారు.

మోడీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. తన చుట్టుపక్కల ఉన్న పలు దేశాలతో సత్ సంబంధాలు కొనసాగించటం లేదని.. ప్రతి ఒక్కరితోనూ పేచీలు పెట్టుకుంటుందన్న వాదనను వినిపిస్తారు. మరి.. మోడీకి ముందు జరిగిందేంటి? అన్నది చూస్తే.. చిన్న దేశం సైతం తోక జాడించేది. ప్రతిఒక్కరితోనూ వారేం చేసినా భరిస్తూ.. దానికి సహనం ఎక్కువన్న ట్యాగ్ వేసుకొని భరించే పరిస్థితి. దీనికి కాస్త భిన్నంగా మోడీ సర్కారు తీరు ఉంటుంది.

నువ్వు బాగుంటే నేను బాగుంటా? నువ్వు తేడా చేస్తే నేను అంతకు మించి చేస్తానన్నట్లుగా కాస్తంత నిక్కచ్చిగా ఉండటం కనిపిస్తుంది. ఈ మధ్యన మాల్దీవుల మంత్రుల అసందర్భ ప్రేలాపనలపై సామాన్య ప్రజలు ఒకలా స్పందిస్తూ.. కొందరు మేధావులు మాత్రం మరోలా రియాక్టు అయ్యారు. దేశ ప్రధానమంత్రిని పట్టుకొని అన్నేసి మాటలు అంటున్నా వారికి పట్టలేదు. అదేమంటే.. మీరంతా మోడీ భక్తులఅంటూ మద్దతుగా నిలిచిన వారిని తూలనాడారు.

అంతేతప్పించి మోడీ వ్యతిరేక ఎజెండా పెట్టుకొని మరీ ఎన్నికల్లో దిగి.. విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తికి మద్దతుగా మాట్లాడే మేధావుల తీరును ఏమని చెప్పాలి? ఎలా చూడాలి? ఇలాంటి సూడో మేధావులకు తనదైన రీతిలో నిర్ణయాన్ని ప్రకటించటం ద్వారా నోట మాట రాకుండా చేశారు మోడీ. తాజా బడ్జెట్ లో మాల్దీవులకు ఆర్థిక సాయం కింద రూ.600 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 50 శాతం ఎక్కువ. దీని ద్వారా మోడీ సర్కారు స్పష్టంగా చెప్పిన అంశం ఒక్కటే. తాము మాల్దీవుల ప్రజలకు ఏ మాత్రం వ్యతిరేకం కాదని.

2023 బడ్జెట్ లో మాల్దీవుల డెవలప్ మెంట్ కు భారత్ రూ.400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినా.. సవరించిన అంచనాలతో రూ.770 కోట్లు ఖర్చు చేసింది. ఆ మొత్తంతో పోలిస్తే తాజా కేటాయింపులు తక్కువగా అనిపించినా.. చివర్లో సవరింపులు చేస్తే మరింత పెరిగే వీలుంది. ఇరుగుపొరుగు దేశాలతో బంధాన్ని బలోపేతం చేయటానికి తమ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని తాజా కేటాయింపుతో చెప్పేశారని చెప్పాలి. ఇరుగుపొరుగు దేశాలతో పంచాయితీ తప్పించి.. స్నేహంగా ఉండరంటూ వాదనలు వినిపించే మేధావులకు మోడీ సర్కారు బడ్జెట్ కేటాయింపులు కాస్తంత కంటగింపుగా మారే వీలుంది.


Tags:    

Similar News