హైదరాబాద్ పురుషుల్లో మనోనిబ్బరం అంత తగ్గిందా? షాకింగ్ నిజం బయటకు!

తాజాగా విడుదలైన జాతీయ క్రైం రిపోర్టుకు సంబంధించిన అంశాల్ని పరిశీలిస్తే.. ఆసక్తికర అంశాలెన్నో కనిపిస్తున్నాయి

Update: 2023-12-07 04:23 GMT

తాజాగా విడుదలైన జాతీయ క్రైం రిపోర్టుకు సంబంధించిన అంశాల్ని పరిశీలిస్తే.. ఆసక్తికర అంశాలెన్నో కనిపిస్తున్నాయి. అలాంటిదే ఒకటి హాట్ టాపిక్ గా మారింది. మగాడు అన్నంతనే మనోనిబ్బరానికి కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. అలాంటి మగాడు.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైనం వెలుగు చూసింది. నివేదికలో పేర్కొన్న గణాంకాల్ని చూస్తే.. హైదరాబాద్ మహానగరంలోని మహిళల కంటే కూడా మగాళ్లే ఎక్కువమంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలింది.

ఆత్మహత్యల సంఖ్యలో దేశంలోని మహానగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ పదో స్థానంలో ఉండగా.. అన్ని విషయాల్లో మహిళల కంటే మగాడే అధిక్యతను ప్రదర్శిస్తామని చెప్పుకునే దానికి భిన్నంగా ఆత్మహత్యల్లో మహిళల కంటే మగాళ్లే ఎక్కువ మంది చేసుకోవటం గమనార్హం.

ఏదైనా కష్టనష్టాలకు గురైతే.. వాటిని సమర్థంగా ఎదుర్కోవాల్సిన దానికి భిన్నంగా నిరాశతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తమ జీవితాల్ని అర్థాంతరంగా ముగించేస్తున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 1,70,924 మంది ఆత్మహత్యలు చేసుకోగా.. ఇందులో 9980 ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. ఇక.. మెట్రో నగరాలతో పోలిస్తే.. ఢిల్లీ మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో బెంగళూరు నిలిచింది. తర్వాతి స్థానంలో సూరత్ ఉండగా.. హైదరాబాద్ నగరం పదో స్థానంలో ఉంది.

షాకింగ్ నిజం ఏమంటే.. ఏడాది వ్యవధిలో హైదరాబాద్ మహానగరంలో మొత్తం 544 మంది ఆత్మహత్యలు చేసుకోగా.. వారిలో మహిళలు 111 మంది మాత్రమే. దీనికి దగ్గర దగ్గర నాలుగు రెట్లు ఎక్కువగా పురుషులు ఉండటం షాకింగ్ గా మారింది. ఈ ఆత్మహత్యలకు కారణం కుటుంబ కలహాలు.. ఆర్థిక ఇబ్బందులు.. నిరుద్యోగం లాంటి సమస్యలు ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆత్మహత్యలకు పాల్పడటంలో కుటుంబ కలహాలే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

గత ఏడాది హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఆత్మహత్యల్లో 20.5 శాతం అప్పులు తీర్చలేకనే చోటు చేసుకోవటం గమనార్హం. వివాహేతర సంబంధాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న ముగ్గురు పురుషులే. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకున్న 120 మందిలో 87 మంది పురుషులే ఉన్నారు. అనారోగ్య కారణాలతో 138 మంది సూసైడ్ చేసుకోగా.. వీరిలో మగాళ్లు వంద మంది ఉండటం చూస్తే.. హైదరాబాద్ మగాళ్లకు ఏమైంది? అన్న భావన కలగటం ఖాయం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రేమ వ్యవహారాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతంలోనూ మహిళల కంటే పురుషులే ఎక్కువగ ఉన్నారు. ఉద్యోగం లేని కారణంగా ప్రాణాలు తీసుకున్న 13 మంది పురుషులే. ఈ గణాంకాల్ని చూసినప్పుడు ఒకింత ఆందోళనకు గురి కావటం ఖాయం.

Tags:    

Similar News