నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూటమిలో కుదిరిన ఫార్ములా ఇదే!
ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం కొలువు తీరినప్పటికీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఏపీలో కూటమి సర్కారు కొలువు తీరి నెలన్నర కావొస్తోంది. ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం ఒక ఎత్తు.. జగన్ ప్రభుత్వంలో ఎదుర్కొన్నే ఇబ్బందులు మరో ఎత్తు. గతంలో ఎప్పుడూ ఎదురుకాని ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నింటిని పంటి బిగువునా భరిస్తూ.. తమ ప్రభుత్వం కొలువు తీరుతుందని.. మంచి రోజులు వస్తాయన్నఆశతో ఎదురుచూశారు తెలుగు తమ్ముళ్లు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ను నమ్ముకొని జనసేనలో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి కూడా ఇంతే. పార్టీ పెట్టి పదేళ్లు అయినప్పటికీ ఎలాంటి పవర్ చేతికి రాకపోవటం.. పవన్ ను నమ్ముకొని ప్రయాణిస్తున్న వారు సైతం తమకు మంచి రోజులు వస్తాయన్న కొండంత ఆశతో ఎదురుచూసిన పరిస్థితి.
ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం కొలువు తీరినప్పటికీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొన్ని పదవుల్ని భర్తీ చేసినప్పటికీ.. పూర్తి చేయాల్సినవి చాలానే ఉన్నాయి. ఇలాంటి వేళ.. ఎలాంటి ఫార్ములాను అమలు చేయాలన్న దానిపై కూటమి మిత్రుల మధ్య చర్చ కొలిక్కి రాలేదు. తాజాగా ఆ లోటు తీరింది. టీడీపీ కూటమి సర్కారులో భాగస్వామ్యులైన జనసేన.. బీజేపీలకు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఎలాంటి ఫార్ములాను అమలు చేయాలన్న దానిపై అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు.
దీని ప్రకారం నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కుదిరిన ఒప్పందాన్ని ఫాలో కావాలని డిసైడ్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 60 శాతం నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకు దక్కుతాయి. మిగిలిన 40 శాతంలో జనసేనకు 30 శాతం పదవులు.. బీజేపీ కార్యకర్తలకు మిగిలిన పది శాతం పదవులు దక్కుతాయి. అదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట 60 శాతం జనసేన కార్యకర్తలకు, 30 శాతం టీడీపీ కార్యకర్తలకు, 10 శాతం బీజేపీ కార్యకర్తలకు ఇస్తారు.
ఇక.. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ కార్యకర్తలకు 50 శాతం పదవులు.. మిగిలిన 50 శాతం పదవుల్ని తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు ఇచ్చేలా నిర్ణయానికి వచ్చారు. తమ కార్యకర్తలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల సర్దుబాటు మీద క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం పదేళ్లుగా పని చేస్తున్న నాయకుల్ని పార్టీ గుర్తు పెట్టుకుంటుందని.. ఎమ్మెల్యేలు సైతం కష్టపడిన వారికి తగ్గ ఫలితం దక్కేలా పోస్టులు ఇవ్వాలన్న సూచన చేశారు.
పార్టీ కోసం కష్టపడిన వారి జాబితాను రూపొందించాలని ఎమ్మెల్యేలను కోరారు నాగబాబు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించటం తమ బాధ్యతగా చెబుతున్న నాగబాబు.. పార్టీ కోసం పని చేసి కేసుల్లో చిక్కుకున్న వారి వివరాలని కూడా పంపించాలని కోరారు. పార్టీ కోసం ఇబ్బందులకు గురైన వారిని గుర్తించి.. వారికి అండగా నిలవటం.. పదవులు కట్టబెట్టే విషయంపై ప్రాధాన్యత ఇవ్వటం తమ లక్ష్యంగా చెప్పారు. ఫార్ములా బాగుంది. అమలులో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.