నెల్లూరు ఆవుకు ప్రపంచ రికార్డు ధర
ప్రపంచ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆవుగా నెల్లూరు జాతి ఆవు చరిత్రపుట్టలో నిలిచింది. 40 కోట్ల భారీ ధర చెల్లించి ఈ ఆవును ఒకరు సొంతం చేసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు గిత్త, నెల్లూరు మేలు జాతి ఆవులకు ఎంతో గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. భారత దేశంలో అందునా మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగిన ఈ జాతి ఆవులు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. ఎండ వేడి, ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకొని అత్యధిక రోగనిరోధక శక్తితో జీవించగలిగే సామర్థ్యం ఉన్న ఒంగోలు, నెల్లూరు జాతి ఆవులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా బ్రెజిల్ లో జరిగిన వేలంపాటలో నెల్లూరు జాతి ఆవు ప్రపంచ రికార్డు సృష్టించింది.
ప్రపంచ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆవుగా నెల్లూరు జాతి ఆవు చరిత్రపుట్టలో నిలిచింది. 40 కోట్ల భారీ ధర చెల్లించి ఈ ఆవును ఒకరు సొంతం చేసుకున్నారు. వయాటినా-19 ఎఫ్ ఐ వి అనే నెల్లూరు జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. 1868లో నెల్లూరు జాతికి చెందిన ఈ రకం ఆవులను బ్రెజిల్ కు తరలించారు. ఆ తర్వాత బ్రెజిల్ తో పాటు పలు దేశాలలో ఈ ఆవులు పాపులర్ అయ్యాయి. బ్రెజిల్ దేశంలోనే 16 మిలియన్ల నెల్లూరు జాతి ఆవులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తెలుపు రంగులో బలిష్టంగా కనిపించే ఈ మేలు రకం ఆవులు వేడి వాతావరణంలో ఇమిడిపోయి జీవించగలవు. ఇక ఈ జాతి ఆవులలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. బాస్ ఇండికస్ అనే శాస్త్రీయ నామంతో ఈ జాతి ఆవులను పిలుస్తుంటారు.
ఇక నెల్లూరు జిల్లా నుంచి ఈ ఆవులు బ్రెజిల్ కు వచ్చిన నేపథ్యంలో నేలోర్ అని ఈ జాతి ఆవులను బ్రెజిల్ ప్రజలు పిలుస్తుంటారు. ఏదేమైనా ఒంగోలు జాతి మూలాలున్న నెల్లూరు జాతి ఆవులు ప్రపంచ స్థాయిలో అత్యధిక ధరకు అమ్ముడుపోవడంపై తెలుగు ప్రజలు, భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.