అధికారం కోసం ఇంత డీప్ ఫేకా?
ప్రస్తుతం దేశంలో ఇలాంటి తరహా రాజకీయాలు పెరిగిపోతున్నాయనే కామెంట్లు నిత్యం వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఏదో ఒకటి చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలి.. ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు చేసో, ప్రజలకు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చో.. ఏదో ఒకటి చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలి.. దీన్ని రాజకీయ చతురతగా అభివర్ణించాలి.. ప్రస్తుతం దేశంలో ఇలాంటి తరహా రాజకీయాలు పెరిగిపోతున్నాయనే కామెంట్లు నిత్యం వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఆ సంగతి అలా ఉంటే... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పూణేకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్ పాటిల్.. బిట్ కాయిన్స్ లను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథయంలో ఈ ఆరోపణలకు సాక్ష్యంగా అన్నట్లుగా బీజేపీ పలు ఆడియో ఫైళ్లు, మెసేజ్ లను విడుదల చేసింది! ఈ ఆడియో ఫైల్స్ లో సుప్రియా సూలే, నానా పటోలే, అమితాబ్ గుప్తా, ఆడిట్ సంస్థ ఉద్యోగి గౌరవ్ మెహతా ఉన్నట్లు చెప్పారు!
వీటిపై స్పందించిన సూలే.. ఇది తన వాయిస్ కాదంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. మరోపక్క తన పరువు తీసినందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ ఆడియో ఫైల్స్ ను ఏఐ – జనరేట్ గా పలువురు నెట్టింట ఆరోపించారు. ఈ సమయంలో ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ కీలక విషయాలు వెల్లడించింది.
అవును... ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్ నేతలు బిట్ కాయిన్ స్కాం కు పాల్పడ్డారంటూ వైరల్ అవుతున్న ఆడియో టేపులపై ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఈ మేరకు మూడు ఏఐ గుర్తింపు సాధనాలను ఉపయోగించినట్లు తెలిపింది. దీంతో.. అవి డీప్ ఫేక్ ఏఐ జనరేటెడ్ ఆడియోలని తేలిందని అంటున్నారు!
దీనికోసం ట్రూమీడియా, డీప్ ఫేక్-ఓ-మీటర్, హియా ఏఐ టూల్స్ ని ఉపయోగించినట్లు చెబుతున్నారు. అన్ని పరీక్షల్లోనూ ఈ ఆడియో ఫైల్స్ డీప్ ఫేక్ ఏఐ జనరేటెడ్ వాయిస్ మిక్సింగ్ ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు! దీంతో... ఈ ఆరోపణలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ ఆడియో ఫైల్స్ ను బీజేపీ తన అధికారిక ఎక్స్ వేదికపై పోస్ట్ చేసింది.
దీంతో... ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు తెరపైకి తెచ్చి హల్ చల్ చేయించడం నిత్యకృత్యం అయిపోయిందని.. అసలునిజం ప్రజలకు తెలిసేలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తైపోతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరోపక్క... తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు బీజేపీ నేతకు పరువు నష్టం దావా నోటీసులు పంపినట్లు సుప్రియా సూలే వెల్లడించిన సంగతి తెలిసిందే!