పాతవాటిని బాగు చేయడం కూడా చరిత్రేనా?!: మోడీకి నెటిజన్ల ప్రశ్న
పాత చొక్కాకు కొత్త గుండీ కుట్టి..కొత్త బట్టలు కుట్టించుకున్న చందంగా మురిసిపోయేవారిని ఏమంటారు?
పాత చొక్కాకు కొత్త గుండీ కుట్టి.. కొత్త బట్టలు కుట్టించుకున్న చందంగా మురిసిపోయేవారిని ఏమంటారు? - ఇదేమో చెప్పడం కష్టమే. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం పండగ చేసుకున్నారు. కొత్త రైల్వేస్టేషన్లను ఎలానూ కట్టించడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన.. తాజాగా పాత రైల్వే స్టేషన్లకు రంగులేసే పనులు చేపట్టారు. దీనిని అత్యంత అట్టహాసంగా 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టడం గమనార్హం.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా తొలి దశలో 27 రాష్ట్రాల్లోని 508 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాన మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి భూమి పూజ చేశారు. తొలి దశలో చేపట్టనున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఏపీకి చెందిన 18 రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఆయా స్టేషన్లను మరింత విస్తరించడంతో పాటు.. ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. అంటే ఒకరకంగా.. వీటిని మరమ్మతు చేయడమన్నమాట.
కానీ, దీనినే ప్రధాన మంత్రి గొప్పగా పేర్కొన్నారు. మోడీ మాట్లాడుతూ.. భారత రైల్వేల చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పారు. ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్‌గా మారతాయన్నారు. అభివృద్ధి దిశగా దేశం పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. కొత్త ఉద్యమానికి, కొత్త సంకల్పానికి ఇది ప్రారంభ వీచిక అన్నారు. విదేశాలతో పోల్చుకుంటే.. మన దేశంలోనే అతి పెద్ద రైలు ట్రాకులను ఏర్పాటు చేశామన్నారు.
అయితే.. మోడీ చేసిన ఈ ప్రసంగం.. ప్రారంభంపై నెటిజన్ల నుంచి ఒకింత పెదవి విరుపులు వ్యక్త మవుతున్నాయి. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ సరిగాలేక.. ప్రమాదాలు జరుగుతున్నాయని.. రైల్వే ట్రాకులు బ్రిటీష్ వారి హయాంలో వేసినవేనని.. వాటిని సరిచేయడం బదులు.. ఉన్నభవనాలకు మరో రంగులు వేసి. పండగ చేసుకుంటే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. పాతవాటిని బాగు చేయడం కూడా చరిత్రేనా? అని అంటున్నారు.