ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్...చలికి చనిపోయిన శిశువులు!
దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆ ప్రవేటు హాస్పటల్ ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
పలు సందర్భాల్లో వైద్యుల నిర్లక్ష్యం ప్రాణాల మీదకి వస్తే.. మరికొన్ని సందర్భాల్లో ప్రాణాలే తీసేస్తుంది. కొన్ని సార్లు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో కాటన్ ముద్దలు, కత్తెరలు మరిచిపోయి కుట్లు వేసేశారనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తుండేవి. ఈ క్రమంలో తాజాగా ఏసీ వేసుకుని సోయి మరిచి నిద్రపోయిన డాక్టర్... ఇద్దరు పిల్లల మృతికి కారణం ఇది!
అవును... ఓ డాక్టర్ నిర్లక్ష్యం ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలు బలితీసుకుంది. తన సుఖం మాత్రం తాను చూసుకోవాలనే ఆలోచనలు ఇంగితం మరిచారో ఏమో కానీ... హాయిగా నిద్రపోవడానికి ఏసీ వేసుకొని పడుకుంటే... ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు శిశువులు మరణించారు. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని శామలి జిల్లాలోని కైరాణా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వీరిద్దరిని ఫొటోథెరపీ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఈ సమయంలో అక్కడ ఇద్దరు చిన్నారులు ఉన్నారని పట్టించుకోని డాక్టర్ కుమార్ (38) నిద్రపోవడానికి రాత్రంతా ఏసీని వేసుకున్నారు. డాక్టర్ తో పాటు ఇతర సిబ్బంది కూడా గుర్రు పెట్టినిద్రపోయారు. ఈ సమయంలో ఆదివారం ఉదయాన్నే చిన్నారులను చూసేందుకు కుటుంబ సభ్యులు వెళ్లేసరికి.. వారిద్దరూ విగతజీవులయ్యారు.
దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆ ప్రవేటు హాస్పటల్ ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఈ విషయం వైరల్ గా మారింది. దీనిపై సర్కిల్ ఆఫీసర్ అమర్ దీప్ మౌర్య స్పందించారు. మృతి చెందిన శిశువుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు డాక్టర్ నీతూ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 304, 420 కింద కైరానా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.