అమల్లోకి నూతన చట్టాలు... తెరపైకి మరణశిక్ష!
భారత న్యాయవ్యవస్థలో పాత చట్టాలు కనుమరుగు కానున్నాయి.. ఆ స్థానంలో నూతన చట్టాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి
భారత న్యాయవ్యవస్థలో పాత చట్టాలు కనుమరుగు కానున్నాయి.. ఆ స్థానంలో నూతన చట్టాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్.ఐ.ఆర్., ఆన్ లైన్ ఫిర్యాదు నమోదు, సెక్షన్ల కుదింపు, తెరపైకి మరణశిక్ష మొదలిన అంశాలు ఈ నూతన అధ్యయనంలో ఉన్నాయి. ఏది ఏమైనా... బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న పాత చట్టాలు కనుమరుగయ్యాయి!
అవును... మనదేశంలో బ్రిటీష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీ.ఆర్.పీ.సీ) లు కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీ.ఎన్.ఎస్.ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీ.ఎస్.ఏ) లు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇందులో భాగంగా... జీరో ఎఫ్.ఐ.ఆర్, పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఆన్ లైన్ లో ఫిర్యాదు నమోదు, ఎస్సెమ్మెస్ వంటి లతో సమన్లు జారీ లాంటి పద్ధతులు కొత్త చట్టాలతో వచ్చాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం.. క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా తీర్పు కచ్చితంగా వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. కొత్త చట్టాల ప్రకారం.. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవశిక్ష పడనుంది.
ఇదే సమయంలో పలు సెక్షన్లను కుదించి.. వీలైనంత స్పష్టత తెచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లో 511 సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యను 358కి కుదించారు. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను ఒక సెక్షన్ కిందకు తెచ్చారు. ఇప్పటికే 18 సెక్షన్లను రద్దు చేశారు. ఇదే సమయంలో... తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని సందర్శించడాన్ని తప్పనిసరి చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా... బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యమిస్తే.. తాము న్యాయానికి పెద్దపీట వేశామని చెప్పారు. భారతీయుల కోసం భారతీయులు ఈ చట్టాలను రూపొందించారని అన్నారు. దీంతో ఇక వలస పాలన నాటి నేర న్యాయచట్టాలు శాశ్వతంగా కనుమరుగుకానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదే క్రమంలో... భారతీయమే కొత్త చట్టాల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా అని తెలిపారు.