ఒకటో తరగతి ఎంట్రీకి కేంద్రం కొత్త కండిషన్!

ఇదే సమయంలో మరోసారి తాజాగా లేఖలు పంపింది. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం (2024 - 25)లో ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది.

Update: 2024-02-27 13:15 GMT

మూడేళ్లు నిండకుండానే ఒక బ్యాగ్ భుజాన్న తగిలించేసి ఐఐటీ ఫౌండేషన్ కోర్సులున్న పాఠశాలల్లో నర్సరీలో పిల్లలను జాయిన్ చేయాలనే ఆత్రం ఇటీవల కాలంలో పేరెంట్స్ కి ఎక్కువైపోయిందనే మాటలు విపరీతంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బాల్యంలోనే పిల్లలు నేచురల్ గా ఎదగడం లేదు సరికదా.. యాంత్రికంగా మారుతున్నారనే ఆందోళనలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది.

అవును... పిల్లలను ఎలాబడితే అలా, ఏ వయస్సులో బడితే ఆ వయసులో స్కూల్స్ లో జాయిన్ చేసేయడం.. క్లాసులు దాటిచేయడం వంటివి చేస్తున్నారనే ఆరోపణలు నిత్యం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో తాజాగా ఒక పిల్లలను పాఠశాలలో చేర్పించే విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా... ఆరేళ్లు నిండితేనే కానీ ఒకటో తరగతి చదవడానికి పిల్లలు అర్హులు కాదని తెలిపింది.

వాస్తవానికి గత ఏడాదిలోనే ఈ విషయంపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనూ కేంద్ర విద్యాశాఖ కోరింది. ఇందులో భాగంగా... నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఆరేళ్లు నిండిన పిల్లలకే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలని కోరింది. ఇదే సమయంలో మరోసారి తాజాగా లేఖలు పంపింది. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం (2024 - 25)లో ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది.

ఈ సందర్భంగా స్పందించిన కేంద్ర విద్యాశాఖ... ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న సిఫార్సును వెల్లడించింది. ఇందులో భాగంగా చిన్నరులు పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలంటూ జాతీయ విద్యా విధానం - 2020 సిఫార్సు చేసిందని.. దీంతో... నూతన జాతీయ విద్యావిధానం (ఎన్.ఇ.పి-2020), విద్యాహక్కు చట్టం పరిధిలోని నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ఇదే సమయంలో పిల్లలకు ఎనిమిదేళ్లు నిండేసరికి 1,2 తరగతులు పూర్తైతే మంచి అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఈ నిర్ణయంతో పాఠశాలల్లో ఇకపై ఆరేళ్లు నిండిన పిల్లలకు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశాలు లభించనున్నాయి.

Tags:    

Similar News