టీడీపీలో కొత్త సమస్య.. బాబుకు ఇబ్బందే బ్రో!
మరొకరు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు.
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కొత్త సమస్య తెరమీదికి వచ్చింది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఒకరిద్దరు నాయకులు ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. తమ మనసులోని భావాలను బయట పెడుతున్నారు. అదికూడా ఎన్నికల్లో టికెట్ కు సంబంధించిన వ్యవహారం కావడంతో పార్టీని ఇరకాటంలోకి నెడుతోంది. తాజాగా ఇద్దరు కీలక నాయకులు బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. వీరిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. మరొకరు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించిన జలీల్ ఖాన్.. తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో విజయవాడ పశ్చిమ నుంచి తనకుమార్తె ఖతూన్ను నిలబెట్టారు. అయితే. ఆమె ఓడిపోయారు. ఇక, కొన్నాళ్లుగా జలీల్ ఖాన్ అనారోగ్య కార ణాలతో బయటకు రావడం లేదు. దీంతో ఈటికెట్‌పై టీడీపీలోని ఇద్దరు కీలక నాయకులు కన్నేశారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఒకరు. అయితే.. ఇక్కడి పరిస్థితిని అంచనా వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో జనసేనతో జట్టు కట్టడంతో ఈ సీటును జనసేనకు ఇస్తారని ప్రచారంలో ఉంది.
జనసేనకు చెందినపోతిన మహేష్ కూడా.. బలంగా ఉన్నారు. దీంతో విజయవాడ వెస్ట్ సీటును ఆయనకే ఇస్తారని భావిస్తున్నా రు. కానీ, తాజాగా జలీల్ బయటకు వచ్చి.. వెస్ట్ సీటును తనకే ఇవ్వాలని.. ఇది మైనారిటీ సీటు అని.. వేరేవారికి ఎలా ఇస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై అవసరమైతే.. పోరాటం చేస్తానన్నారు. ఆ పరిస్థితి రాదని.. చంద్రబాబుపై నమ్మకం ఉందని అన్నారు. దీంతో ఇదొక పెద్ద చిక్కుముడి కానుంది. మైనారిటీ వర్గాల్లో జలీల్‌కు బలం ఉండడం గమనార్హం.
ఇక, వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి 2019లో వైసీపీ తరపున గెలిచి.. తర్వాత ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చారు. కొన్నాళ్ల కిందట టీడీపీకి అనుకూలంగా మారారు. ఇక, తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లోనూ తాను వెంకటగిరి నుంచే పోటీ చేస్తానన్నారు. ఇక్కడప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తీసుకుంటానన్నారు. కానీ, వాస్తవానికి ఇక్కడ టీడీపీ నాయకుడు కొరుగుంట్ల రామకృష్ణ ఉన్నారు. గతంలో వరుస విజయాలు కూడా దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈయనకే టికెట్ ఇవ్వాలని బాబు నిర్ణయించుకున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఈ నియోజకవర్గం కూడా కాక రేపుతోంది. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.