తెలంగాణ ఎన్నికల్లో 'సీతమ్మ' పలుకులు.. చేయాల్సింది చేసేసి!!
సరే.. రాజకీయంగా విమర్శలు కామనే కదా! అనుకోవచ్చు. కానీ, ఇక్కడే సీతమ్మ లోతుల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఆమె చేసిన విమర్శలు.. ఆమెకే తగులుతున్నాయి.
చేయాల్సింది చేసేసి.. ఇప్పుడు నీతులు చెబితే ఎవరైనా ఏమంటారు? నవ్విపోతారు! అచ్చంగా ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాలు.. పలుకులు కూడా అలానే ఉన్నాయని అంటున్నారు ఆర్థిక నిపుణులు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో పర్యటించిన నిర్మలా సీతారామన్.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. సరే.. రాజకీయంగా విమర్శలు కామనే కదా! అనుకోవచ్చు. కానీ, ఇక్కడే సీతమ్మ లోతుల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఆమె చేసిన విమర్శలు.. ఆమెకే తగులుతున్నాయి.
ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల గురించి నిర్మలమ్మ ప్రస్తావించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులు పాటు చేసేశారని అన్నారు. అంతేకాదు.. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసేసిన కేసీఆర్‌ను ఇంటికి పంపేయాలని పిలుపునిచ్చారు. అయితే.. వాస్తవం ఏంటంటే.. కేంద్రమే రాష్ట్రాలను అప్పులు చేసుకోవాలని ప్రోత్సహించింది.
తాను ఇవ్వాల్సిన గ్రాంట్స్‌కు కోత పెట్టి.. చెత్తపై పన్నేస్తే.. ఇంత అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తాం.. రైతులు వాడే కరెంటు మీటర్లు పెడితే.. మరింత అప్పులు చేసుకునే అవకాశం కల్పిస్తామని ఆఫర్లు ఇచ్చింది. అంతేకాదు.. జీఎస్టీ వసూళ్లలోనూ రాష్ట్రాలకు అన్యాయం చేసింది కేంద్రమే. ఈ నేపథ్యంలోనే అనేక సందర్భాల్లో కేసీఆర్.. ఈ విషయాలను ఏకరువు పెడుతూనే ఉన్నారు. కేంద్రం చేస్తున్న చర్యల కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా ఆయన చెబుతూ వచ్చారు.
"కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తాం" అని కూడా సీతమ్మ సెలవిచ్చారు. అయితే.. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని.. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. ఆదుకోవాలని సీఎం కేసీఆర్ అనేక పర్యాయాలు ఢిల్లీ పర్యటనలు చేసి మొత్తుకున్నారు. అనేక మందితో కబురు కూడా పెట్టారు. కానీ, కేంద్రం చెవికెక్కించుకోలేదు. దీంతో కేసీఆర్ సర్కారే దీనిని పూర్తి చేసింది. కానీ, ఇప్పుడు మాత్రం ఎన్నికల సమయానికి దీనిలో వంకలు వెతికే పనిని పెట్టుకోవడం కేంద్రం వంతైంది. ఇక, అవినీతిపై విచారణ జరిపిస్తామన్న మాట కూడా తెలంగాణ సమాజానికి ఎక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అవినీతి ఎక్కువగా ఉందని అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముందు వాటిని తేల్చాలనే డిమాండ్లు తరచుగా వినిపిస్తున్నాయి.
"నీళ్లు, నిధులు, నియామకాల.. తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదు"- అని సీతమ్మ చెప్పుకొచ్చారు. మరి ఇన్నాళ్ల బట్టి గత పదేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది? నీటి వివాదాలు తీర్చలేక పోయింది. నిధులు ఇచ్చేందు కు.. ఆదుకునేందుకు మొహం చాటేసింది. ఇక, నియామకాల విషయానికి వస్తే.. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేటు పరంచేస్తామంటూ.. లీకులు ఇస్తూ.. తెలంగాణ సమాజంలో అశాంతిని, గందరగోళాన్ని సృష్టించింది కేంద్రం కాదా? అనే ప్రశ్నకు నిర్మలమ్మే సమాధానం చెప్పాలని పరిశీలకులు అంటున్నారు.