మోడీకి ఆయన ఒక్కడు చాలా ?

ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. మోడీ కంటే ముందే రాష్ట్ర మంత్రిగా మహరాష్ట్రలో పనిచేశారు.

Update: 2024-09-25 17:34 GMT

ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. మోడీ కంటే ముందే రాష్ట్ర మంత్రిగా మహరాష్ట్రలో పనిచేశారు. అలాగే జాతీయ రాజకీయాల్లోకి ముందుగా వచ్చారు. 2009లో అద్వానీ నాయకత్వంలో బీజేపీ రెండవసారి ఓటమి పాలు అయినపుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయనే స్వీకరించారు. అది కూడా అరెస్సెస్ చలవతో. ఆయనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

ఇక నితిన్ గడ్కరీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నపుడు నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నారు. అంటే నితిన్ గడ్కరీ నాయకత్వంలో ఆయన పనిచేశారు. మోడీ 2013లో జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మూడు సార్లు ప్రధాని అయ్యారు కానీ బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ గా మాత్రం ఎపుడూ కాలేదు.

సాధారణంగా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వారికి ప్రధాని పదవి నెక్స్ట్ స్టెప్ గా ఉంటుంది. అలా నితిన్ గడ్కరీకి ఆశలు ఉన్నాయి. అయితే మోడీ మూడు విడతల ప్రభుత్వంలో గడ్కరీకి కేంద్ర మంత్రి పదవి అయితే దక్కింది కానీ ఆయన కేంద్రంలో కీలకంగా మాత్రం పెద్దగా లేకుండానే పరిమిత పాత్రనే పోషిస్తున్నారు.

గడ్కరీకి పదవి అన్నది ఆరెస్సెస్ అభిమతం. అందుకే ఆయనను కొనసాగిస్తున్నారు అని కూడా అంటుంటారు. ఇక నాగపూర్ లో ఉన్న ఆరెస్సెస్ కి అతి దగ్గర వాడిగా సంఘ్ కి విశ్వాసపాత్రుడిగా ఉన్న నితిన్ గడ్కరీ తన ప్రధాని ఆశలను ఇండైరెక్ట్ గా బయటపెట్టుకున్నారు కూడా. ఇటీవలే ఆయన తనకు విపక్షం నుంచి ప్రధాని పోస్టు ఆఫర్ వచ్చిందని తాను ఆ తరహా రాజకీయాలు చేయలేను కాబట్టే తిరస్కరించాను అని ఒక బాంబు పేల్చారు.

అంటే దాని అర్థం తాను ప్రధాని స్థాయి వ్యక్తిని అని రేసులో ఉన్నాను అని చెప్పకనే చెప్పారు అని కూడా చాలా మంది విశ్లేషించారు. ఇదిలా ఉంటే నితిన్ గడ్కరీ తాజాగా మరో సంచలనానికి తెర లేపారు అదేంటి అంటే నాలుగవ సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాదు అన్న జోస్యంతో.

మూడు సార్లు ప్రధాని అయిన మోడీకి నాలుగవ చాన్స్ కష్టమే అని నితిన్ గడ్కరీ బాంబు పేల్చారు. అంటే 2029 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు అవుతుందని సొంత పార్టీకి చెందిన కీలక నేత కేంద్ర మంత్రి ఈ విధంగా అన్నారూ అంటే మోడీ సర్కార్ కి అది ఏ విధంగా వినిపిస్తుందో అర్ధం చేసుకోవాల్సిందే మరి.

గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. మరోసారి భారత్ లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని అమెరికా ప్రవాసుల సభలో మోడీ అంటున్న టైం లోనే నితిన్ గడ్కరీ చల్లగా చెప్పాల్సింది చెప్పేశారు.

మహారాష్ట్రంలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అధవాలేతో కలసి ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మళ్లీ గెలుస్తామో లేమో అని డౌట్లు పెట్టారు. తమ ప్రభుత్వం వరసగా నాలుగవ సారి అధికారంలోకి వస్తుందో రాదో చెప్పలేనని అన్నారు. అంతే కాదు రామ్ దాస్ అధవాలే కేంద్ర మంత్రి అవుతారో లేదో కూడా చెప్పలేనని అన్నారు.

అయితే ఆ తరువాత ఆయనే నాలిక కరచుకుని తాను జస్ట్ జోక్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. అయితే నితిన్ గడ్కరీ జోక్ అని అన్నా ఆయన మనసులో మాట ఇదే అని అంటున్నారు. బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిందే మిత్రుల మీద ఆధారపడి. బీజేపీ బలం ఇటీవల జరిగిన ఎన్నికల్లో సగానికి సగం తగ్గింది. మరో అయిదేళ్ల తరువాత బీజేపీకి ఇంకా యాంటీ ఇంకెంబెన్సీ పెరుగుతుంది.

మళ్లీ నాలుగవ సారి బీజేపీకి జనాలు చాన్స్ ఇస్తారా అంటే కష్టమన్న మాట రాజకీయం తెలిసిన అందరికీ అర్థం అవుతుంది. మోడీ ఇమేజ్ కూడా గతం కంటే తగ్గుతోందని కూడా అంటున్నారు. ఈ రకంగా వాస్తవాలు ఉన్నాయి. నితిన్ గడ్కరీ అయితే చాలా ఫ్రీగా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొడుతూ ఉంటారు.

అదే సమయంలో ఆయన మిగిలిన వారిలా లేని పోనివి చెప్పరు. అందుకే ఆయన యధార్ధ వాదిగా పరమ విరోధిగా మారారు. ఇపుడు మోడీ అమిత్ షా 2029లోనూ మేమే వస్తామని బల్ల గుద్దుతున్న నేపధ్యంలో మంత్రి వర్గ సహచరుడు అయిన నితిన్ గడ్కరీ ఈ విధంగా చెప్పడం ఇండియా కూటమిని వెయ్యేనుగుల బలాన్ని ఇస్తోంది. అదే టైం లో మోడీకి కొత్త తలనొప్పిగా మారుతోంది. మోడీకి ఆయన ఒక్కడు చాలుగా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.

Tags:    

Similar News