ఇక ఎలక్ట్రిక్ హైవేలు: కేంద్ర మంత్రి సంచలన ప్రకటన!
ఈ నేపథ్యంలో నాగపూర్ లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు
కేంద్ర ఉపరితల, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. వీటి వల్ల ఆర్థికంగానూ ప్రయోజనం ఉంటుందన్నారు. విద్యుత్ రహదారుల ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్న ప్రైవేట్ రంగ పెట్టుబడిదార్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తామని వెల్లడించారు. విద్యుత్ రహదార్ల కోసం ప్రభుత్వానికి చౌకగా విద్యుత్ ను ఇవ్వడం విద్యుత్ మంత్రిత్వ శాఖకూ పెద్ద కష్టమైన పని కాదని అభిప్రాయపడ్డారు.
తాను ఇప్పటికే విద్యుత్ మంత్రిత్వ శాఖతో మాట్లాడానని గడ్కరీ తెలిపారు. ఒక్కో యూనిట్ రూ.3.50కే విద్యుత్ సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నానని చెప్పారు. వాణిజ్యపరంగా యూనిట్ ధర రూ.11గా ఉందన్నారు. ఎలక్ట్రిక్ తీగల నిర్మాణం ప్రైవేట్ రంగ పెట్టుబడిదార్లు చేపడతారని చెప్పారు. టోల్ మాదిరిగా విద్యుత్ ఛార్జీని ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ) వసూలు చేస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో నాగపూర్ లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే.. ఢిల్లీ- జైపూర్ మధ్య దేశంలోనే మొట్టమొదటి విద్యుత్ హైవేను నిర్మించాలన్నది తన కల అని చెప్పారు.
కాగా విద్యుత్ రహదార్లు అంటే.. విద్యుత్ రైళ్లకు సంబంధించి రైలు పట్టాలకు సమాంతరంగా ఎలాగైతే పైన విద్యుత్ సరఫరా తీగలు ఉంటాయో ఆ తరహాలోనే రహదారులపైనా తీగలను ఏర్పాటు చేస్తారు. వాహనాలు ఈ తీగల నుంచి ప్రసారమయ్యే విద్యుత్ సాయంతో రోడ్లపై ప్రయాణిస్తాయి. ఈ మేరకు వాహనాల్లోనూ, విద్యుత్ తీగల లైన్లలో సాంకేతికతను ఏర్పాటు చేస్తారు.
అలాగే కార్లలో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేయబోమని నితిన్ గడ్కరీ తెలిపారు. అక్టోబర్ 2023 నుంచి 6 ఎయిర్ బ్యాగుల్ని తప్పనిసరి చేసే భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని గతేడాది ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. కార్లలో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేసే నిబంధనలను అమలు చేయడం తమకు ఇష్టం లేదని వెల్లడించారు.
గతేడాది రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ... కార్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల భద్రతను పెంచడానికి సెంట్రల్ మోటార్స్ వెహికిల్ రూల్స్–1989 ను సవరించాలని నిర్ణయించింది. దీని ద్వారా కార్లలో ప్రయాణికుల భద్రతను మరింతగా మెరుగుపరచాలని భావించింది. ఈ క్రమంలోనే ఏప్రిల్1, 2021 తర్వాత తయారుచేసిన వాహనాల్లో ముందు రెండు సీట్లకు ఎయిర్ బ్యాగుల్ని తప్పనిసరి చేసింది.
ఎయిర్ బ్యాగుల వల్ల కార్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోగలరన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీమియం కార్లే కాకుండా.. రూ.20 లక్షల లోపు కార్లలో కూడా పలు కంపెనీలు 6 ఎయిర్ బ్యాగులను అందిస్తున్నాయి. ప్రజలు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో కార్ల కంపెనీలు కూడా అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నాయి. బిల్ట్ క్వాలిటీ, ఎయిర్ బ్యాగ్స్, ఇతర సాంకేతిక అంశాలను కార్లలో అమరుస్తున్నాయి.