మోడీ పాదాలను చూస్తే ఆ సీఎంకి ఏమవుతోంది ?

ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా నాయకుడు. బీజేపీ వారికి ఆయన దేవుడు. కమలనాధులు ఆయనను చూస్తే పులకించి పోతారు.

Update: 2024-11-14 03:52 GMT

ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా నాయకుడు. బీజేపీ వారికి ఆయన దేవుడు. కమలనాధులు ఆయనను చూస్తే పులకించి పోతారు. ఆయన ముందు సాష్టాంగం పడతారు. అయితే బీజేపీకి చెందని ఆయన మాత్రం మోడీ పాదాలు చూస్తే మాత్రం తనను తాను మరచిపోతారు. ఆయన ఆ పాదాలను తాకి పునీతం అవుతూంటారు.

ఇంతకీ ఆ కధా కమామీషూ ఏంటో ఒక్కసారి చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ మోడీని చూసినపుడల్లా పాదాలకు నమస్కారం పెట్టేయడం అలవాటు చేసుకున్నారు. మోడీ వస్తే చాలు ఆయనతో వేదిక పంచుకుంటే చాలు నితీష్ చూపులు ఆయన పాదాల మీదనే ఉంటాయేమో.

ఇది గతంలో రెండు మూడు సార్లు జరిగింది. మొదట్లో ఏమో అనుకున్నా ఆ తరువాత మాత్రం వద్దు వద్దు అంటూనే ఆయనను వారించారు మోడీ. కానీ నితీష్ మాత్రం ఆ పాదాలను చూస్తే చాలు భక్తిభావంతో పులకరించిపోతున్నారు.

తాజాగా బీహార్ టూర్ లో మోడీతో కలసి వేదిక పంచుకున్న నితీష్ కుమార్ కి ఆయన పాదాలు చూడగానే సాష్టాంగం పెట్టాలనిపించింది. అంతే ఆయన క్షణం ఆలోచించలేదు. పాదాలకు నమస్కారం పెట్టడానికి యత్నించారు. వెంటనే గమనించిన మోడీ ఆయనను నిలువరించారు.

అయితే మోడీ ఎంత నిలువరిస్తున్నా నితీష్ మాత్రం పదే పదే అదే పని చేస్తున్నారు. ఆయన అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది చర్చగానే ఉంది. నిజానికి నరేంద్ర మోడీ వయసులో నితీష్ కంటే పెద్ద వారు, పైగా ప్రధాని స్థానంలో ఉన్నారు. ఆ లెక్కన పాదాలకు నమస్కరించడంలో తప్పు లేదు.

కానీ మోడీ నితీష్ ఈ మధ్య కాలంలోనే కలుసుకోలేదు. ఈ ఇద్దరూ గతంలోనూ ఎన్డీయేలో కలసి పనిచేశారు. ఇద్దరూ ఎన్నో సభలలో కలసి పాల్గొన్నారు. మరి నాడు లేని ముచ్చట ఇపుడే ఎందుకు అన్నదే చర్చగా ఉంది. అయితే నితీష్ ఎన్డీయేలో ఉంటానని పదే పదే చెబుతున్నారు. కానీ ఆయన ఈ కూటమి నుంచి ఆ కూటమికి జంపింగులు చేస్తూ పోతున్నారు.

దాంతో తన విశ్వసనీయతను ఈ విధంగా చాటుకునేందుకు చేస్తున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. అంతే కాదు మోడీ ఇక దేశంలో తిరుగులేని నేత ఆయనతో ఉంటేనే బెటర్ అనుకుని తనలో తాను రాజీ పడి ఈ విధంగా చేస్తున్నారా అన్నది అయితే అర్థం కావడం లేదు అంటున్నారు. మోడీ అయితే నితీష్ తన పాదాలను తాకే ప్రయత్నం చేస్తున్నప్పుడల్ల వెంటనే నిలువరిస్తున్నారు.

అన్నట్లు రాజకీయాల్లో పాదాలను తాకితే ఇక వారి కాళ్ళు లాగేసినట్లే అని సెటైర్లు ఉన్నాయి. ఇలా గతంలో ఎందరో నాయకులు పాద పూజలు చేయించుకున్న మీదట మాజీలు అయిన చరిత్రలూ ఉన్నాయి. మోడీ విషయానికి వస్తే ఆయన ఢక్కామెక్కీలు తిన్న రాజకీయ నేతగా ఉన్నారు. ఆయనకు ఇలాంటివి అన్నీ తెలుసు అనే అంటున్నారు. నితీష్ మంచి మనసులో పాదాలకు నమస్కరించాలనుకున్నా ఎందుకైనా మంచిదనే నిలువరిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి నితీష్ మాత్రం మోడీ పాదాలను చూస్తే మరోసారి సాష్టాంగం పెట్టరన్న గ్యారంటీ అయితే లేదనే అంటున్నారు అంతా.

Tags:    

Similar News