నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మహిళా ఎమ్మెల్యేపై సీఎం ఫైర్‌!

బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ మరో వివాదంలో కూరుకుపోయారు.

Update: 2024-07-25 07:40 GMT

బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ మరో వివాదంలో కూరుకుపోయారు. ఇటీవల కాలంలో బీహార్‌ లో వరుసగా వంతెనలు, బ్రిడ్జిలు కుప్పకూలుతున్న సంగతి తెలిసిందే. దీనిపై నితీశ్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు.. ఆర్జేడీ, కాంగ్రెస్‌ దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఇది చాలదన్నట్టు ఇప్పుడు తాజాగా నితీశ్‌ కుమార్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. బీహార్‌ అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఇటీవల బీహార్‌ లో ఓబీసీలకు ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచింది. ఈ నేపథ్యంలో వీటిని కోర్టులు సమీక్షించడానికి వీలు లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ లో చేర్చాలని ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యేలు బీహార్‌ శాసనసభలో నిరసనకు దిగారు. దీంతో ఆర్జేడీ ఎమ్మెల్యేల డిమాండ్‌ తో శాసనసభలో గలాటా చోటు చేసుకుంది.

ఆర్జేడీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు సైతం తమ స్థానాల్లో నుంచి లేచి సభ మధ్యలోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి నితీశ్‌ డౌన్‌ డౌన్‌ అంటూ పెద్ద పెట్టున నినదించారు.

దీంతో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యే రేఖాదేవిపై విరుచుకుపడ్డారు. మీరొక మహిళ.. మీకు ఏమీ తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీంతో సీఎం నితీశ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష ఆర్జేడీ సభ్యులు అందిపుచ్చుకున్నారు. మహిళలను అవమానిస్తున్నారని ఆయనపై మండిపడ్డారు. సీఎం నితీశ్‌ వ్యాఖ్యలు మహిళల పట్ల ఆయనకున్న సంకుచిత భావాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

బీహార్‌ శానసమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం రబ్రీదేవి.. నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానించడం ఆయనకు ఏమీ కొత్త కాదని నిప్పులు చెరిగారు. గతంలోనూ నితీశ్‌ మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని రబ్రీదేవి గుర్తు చేశారు.

గతంలో జనాభా నియంత్రణపై మాట్లాడుతూ నితీశ్‌ మహిళలను కించపరిచారని రబ్రీదేవి మండిపడ్డారు. ఇప్పుడు మహిళా ఎమ్మెల్యేను నీకేం తెలియదంటూ వ్యాఖ్యానించడం గర్హనీయమని ధ్వజమెత్తారు.

ఈ నేపథ్యంలో నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. కేంద్ర బడ్జెట్‌ లో బీహార్‌ కు ఎక్కువ నిధులు సాధించుకుని దేశవ్యాప్తంగా టాక్‌ ఆఫ్‌ ద పర్సన్‌ గా నిలిచిన ఆయన ఇప్పుడు మహిళా ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వివాదంలో కూరుకుపోయారు.

Tags:    

Similar News