నితీశ్ వ్యాఖ్యల్లో తప్పేముందన్న డింపుల్
జనాభా నియంత్రణ విషయంలో మహిళలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే.
జనాభా నియంత్రణ విషయంలో మహిళలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ నితీశ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇంకెంత దిగజారతారంటూ మోదీ ఫైరయ్యారు. మరోవైపు ప్రముఖ అమెరికా సింగర్ మేరీ మిల్ బెన్ కూడా నితీశ్ వ్యాఖ్యలపై స్పందించారు. మోదీని అభిమానించే ఆమె.. నితీశ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక జాతీయ మహిళా కమిషన్ కూడా నితీశ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని నితీశ్ కోరారు. కానీ ఈ వివాదంలో ఇప్పుడు నితీశ్ కు డింపుల్ యాదవ్ మద్దతుగా నిలిచారు.
నితీశ్ ప్రకటనలో తప్పులేదని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య అయిన డింపుల్ యాదవ్ సమర్థించారు. నితీశ్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారని, సాధారణంగా దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు ప్రజలు నిరాకరిస్తారని ఆమె పేర్కొన్నారు. నితీశ్ తనదైన శైలిలో మాట్లాడారని, ఆయన చెప్పిన విధానం తప్పేమో కానీ ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని డింపుల్ వివరించారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం సరికాదంటూ ఆమె చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ దీన్ని పెద్ద విషయంగా మారుస్తుందనే అర్థం వచ్చేలా డింపుల్ వ్యాఖ్యానించారు.
ఇటీవల అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి మట్లాడుతూ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కులగణకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్ లో సంతానోత్పత్తి రేటు 4.2 నుంచి 2.9 శాతానికి పడిపోయిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా లైంగిక సంపర్కం సమయంలో మహిళలు తమ భర్తలను ఎలా నిరోధించాలో వివరించారు. భర్తలు చేసిన చర్యలు మరిన్ని జననాలకు దారి తీశాయని, అయితే చదువుకున్న మహిళలకు తమ భర్తలను ఎలా అడ్డుకోవాలో తెలుసన్నారు. అందుకే జననాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.