కాంట్రాక్టర్లకు నో బిల్స్ ?
తెలంగాణా ఎన్నికలు ఏమోకానీ కాంట్రాకర్టకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికలేమో దగ్గరకు వచ్చేస్తున్నాయి. చాలా పథకాలకు నిధుల కరువు తెలుస్తోంది.
తెలంగాణా ఎన్నికలు ఏమోకానీ కాంట్రాకర్టకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికలేమో దగ్గరకు వచ్చేస్తున్నాయి. చాలా పథకాలకు నిధుల కరువు తెలుస్తోంది. పథకాలు అమలుచేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పరిస్ధితులు ఎదురవుతాయో కేసీయార్ కు బాగా తెలుసు. అందుకనే పథకాల అమలు అయ్యేవరకు నిధుల సమీకరణపై కేసీయార్ ఉన్నతాధికారుల వెంట పడుతున్నారు. ముందు పథకాలకు నిధులు సమీకరించి సంపూర్ణంగా నెరవేరిస్తే కానీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అవకాశంలేదు.
అందుకనే అర్జంటుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించవద్దని ప్రగతిభవన్ నుండి ఫైనాన్స్ డిపార్ట్ మెంటుకు ఓరల్ ఆర్డర్స్ వచ్చినట్లు సమాచారం. ఎంతపెద్ద కాంట్రాక్టర్ అయినా సరే, ఎలాంటి వర్కు అయినా సరే బిల్లులు ఆపేయాలనేది ఓవర్ ఆర్డర్స్ సారంశం. దాంతో జూలై నుండి కాంట్రాక్టర్లందరికీ బిల్లులు చెల్లింపులు నిలిపేశారని సమాచారం. దీనివల్ల ముందు కాంట్రాక్టర్లు తర్వాత కొందరు మంత్రులు చాలామంది ఎంఎల్ఏలు ఇబ్బందులు పడుతున్నారట.
ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్దులకు ఎంతోకొంత నిధులను సమకూర్చేది కాంట్రాక్టర్లే. అలాగే కొందరు మంత్రులు చాలామంది ఎంఎల్ఏలు బినామీ పేర్లతోను బంధువుల పేర్లతోనో కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. అలాగే కొందరు పెద్ద పెద్ద కంపెనీల్లో వాటాదారులుగా ఉన్నారట. ప్రభుత్వం సడెన్ గా బిల్లుల చెల్లింపులను ఆపేస్తే ఫండ్స్ రొటేషన్ ఆగిపోతోంది. దాంతో సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు, మెటీరియల్ సప్లయర్లకు చేయాల్సిన పేమెంట్లు అన్నీ ఆగిపోతాయి లేదా ఇబ్బందులు పడాల్సుంటుంది.
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే ఎదురయ్యే సమస్యలు కేసీయార్ కు తెలీకకాదు. కాకపోతే రుణమాఫీ, దళితబంధు, బీసీ బంధు, మైనారిటిలకు లక్ష రూపాయల సాయం లాంటి అనేక పథకాలకు నిధులు సర్దుబాటు కాకపోతే అసలు పార్టీ గెలుపుకే ఇబ్బందులు వచ్చేస్తాయని భయపడుతున్నారు. అసలే వివిధ పథకాల అమలుపై ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలుకాక లబ్దిదారులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో గెలవటం అనే అతిపెద్ద సమస్య నుండి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అనే తాత్కాలిక సమస్య తప్పదని కేసీయార్ నిర్ణయించినట్లున్నారు. అందుకనే బిల్లుల చెల్లింపులు నిలిపేశారని పార్టీవర్గాల టాక్.