ఉత్తర భారతం - దక్షిణ భారతం... ఢిల్లీలో నిరసన సక్సెస్!
ఈ సమయంలో ఈ మాటలు అసెంబ్లీలోనూ, శాసనమండలి లోనూ కూర్చుని మాట్లాడుకుని..
గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశ విభజనకు బీజాలుగా మారుతున్నాయనే కామెంట్లు ఇటీవల కాలంలో ఎక్కువైపోయిన సంగతి తెలిసిందే! వాస్తవానికి దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలపై కేంద్రంలోని ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్య దోరణి అవలంభిస్తుంటాయనే కామెంట్లలో వాస్తవం లేకపోలేదని పలు ఉదాహరణలు చెబుతుంటారు! దేశంలోనే అత్యధిక పన్నులు కేంద్రానికి చెల్లించే దక్షిణాది రాష్ట్రాలపై సైతం బీజేపీ సవతి ప్రేమ చూపిస్తుందని అంటున్నారు.
ఈ సమయంలో ఈ మాటలు అసెంబ్లీలోనూ, శాసనమండలి లోనూ కూర్చుని మాట్లాడుకుని.. రాష్ట్రంలో ఉండి కేంద్రంపై విమర్శలు చేయడం కంటే.. నేరుగా హస్తినలోనే తమ పోరాటం చేయాలని భావించారో ఏమో కానీ.. కర్ణాటక నాయకులు ఢిల్లీ ఢిల్లీలో గర్జించారు. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. నిధుల కేటాయింపులో కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందనే విషయాన్ని ఢిల్లీలో బలంగా వినిపించే ప్రయత్నం చేశారు! ఈ సమయంలో మరోసారి బీజేపీ విధానాలు దేశ విభజనకు బీజాలుగా మారాయనే కామెంట్లను తెరపైకి తెచ్చాయి!!
అవును... దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం పూర్తిగా సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపిస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిపి మొత్తం 150 మంది ఆందోళనలు చేశారు. గ్యారంటీ పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యపై గట్టిగా స్పందించారు. ఈ సందర్భంగా కర్నాటక సర్కారు ప్రతినిధులంతా దేశ రాజధానిలో తిష్టవేసి.. దక్షిణ భారత రాష్ట్రాల అసమ్మతి గొంతుకు ప్రతినిధుల్లా మారారు.
ఈ సందర్భంగా స్పందించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య... ఆర్థిక సంఘాలు చేసే సిఫార్సులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చుతున్నట్లు ఆరోపించారు. ఇదే సమయంలో... 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయడం లేదని.. అందువల్ల దేశంలోనే అత్యధిక పన్నులు కేంద్రానికి చెల్లించే రాష్ట్రాల్లో రెండోదైన కర్ణాటక సుమారు రూ.1.88 లక్షల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక ప్రధానంగా... 1972లో అప్పటి కేంద్ర సర్కారు ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపును స్వీకరించిన దక్షిణ భారత రాష్ట్రాలు జనాభాను నియంత్రించాయని.. నేడు అదే తమకు శాపంగా మారిందని.. ఆర్థిక సంఘం మార్గదర్శకాల్లో ఒకటైన సనాభా ఆధారంగా పొందాల్సిన నిధులు తమకు తగ్గిపోతున్నాయని అన్నారు. జనాభా నియంత్రణను పాటించని కొన్ని ఉత్తర భారత రాష్ట్రాలు ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల లబ్ధిపొందుతున్నాయని విశ్లేషించారు.
అనంతరం స్పందించిన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్... రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని సరిదిద్దలేని సర్కారు కేంద్రంలో ఎందుకున్నట్లు అని ప్రశ్నించారు. కర్ణాటకలో మొన్నటి వరకు డబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్పుకునే బీజేపీ అధికారంలో ఉన్నా కూడా... కేంద్రం నుంచి నయాపైసా సాధించలేదని అన్నారు. ఆర్థిక సంఘం అధికారాలలో జోక్యం చేసుకోబోమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఆ అధికారాలు ఎందుకని నిలదీశారు.
దేశ విభజనకు బీజాలు!:
అయితే... ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు దేశ విభజన బీజాలు నాటేలా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు! వీటిని సంకుచిత ఆరోపణలుగా భావిస్తూ.. ఇవి దేశాన్ని ఉత్తరం - దక్షిణంగా మార్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే... మోడీకి ఇవి సంకుచిత ఆరోపణలుగా అనిపిస్తే... దక్షిణాది రాష్ట్రాల విషయంలో వారు అవలంభిస్తున్న వైఖరి అంతకు మించి అనే కామెంట్లు తదనుగుణంగా వినిపిస్తున్నాయి!