గ్యాప్ ఇవ్వడం లేదు.. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ!

ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ ఆఫీసుల కూల్చివేత హడావిడి జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-06-24 04:49 GMT

ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ ఆఫీసుల కూల్చివేత హడావిడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చివేసినప్పటి నుంచి ఈ హడావిడి మొదలైంది. ఇదే క్రమంలో... రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ప్రకాశం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వైసీపీ కార్యాలయాలకు నోటీసులు జారీచేస్తున్నారు అధికారులు!

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న, నిర్మాణం పూర్తయిన పలు వైసీపీ కార్యాలయాలు అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం కూల్చివేసిన అనంతరం విశాఖలోని వైసీపీ ఆఫీసుకు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే! ఇదే క్రమంలో తాజాగా జగన్ సొంతజిల్లా కడపలోని వైసీపీ ఆఫీసుకు నోటీసులు వెళ్లాయి.

అవును... రాష్ట్రంలోని వైసీపీ ఆఫీసులకు అధికారులు నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో తాజాగా కడపజిల్లాలోని వైసీపీ ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా అనుమతిలేని భవనాన్ని ఎందుకు కూల్చకూడదో వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో... వైసీపీ జిల్లా అధ్యక్షుడి పేరిట నోటీసులు జారీ చేశారు.

కడప - రేణిగుంట జాతీయ రహదారి పక్కనే రామాంజనేయపురం వద్ద సర్వే నెంబర్ 424-7లో స్థలం కేటాయించారు. ఇదే సమయంలో... అనకాపల్లి జిల్లా కొత్తూరు నర్సింగరావుపేటలో 1.75 ఎకరాల్లో అనుమతులు లేకుండానే వైసీపీ ఆఫీస్ భవన నిర్మాణం పనులు దాదాపు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ భవనానికి అధికారులు నోటీసులు జారీచేశారు.

Tags:    

Similar News