మేనత్త చెప్పినా.. ఎన్టీఆర్ వింటారా?

మరి ఎంతమంది డిమాండ్ చేసినా ఇప్పటివరకూ సైలెంట్గా ఉన్న ఎన్టీఆర్.. మేనత్త పిలిస్తే వెళ్తారా? అన్నది ఇక్కడ ప్రశ్న.

Update: 2023-09-13 16:30 GMT

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ విషయం ఎంత చర్చనీయాంశంగా మారిందో.. దీనిపై ఎన్టీఆర్ స్పందించకపోవడమూ అదే స్థాయిలో హాట్ టాపిక్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ తాత స్థాపించిన పార్టీని ప్రస్తుతం నడిపిస్తున్న చంద్రబాబు స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో భాగంగా 14 రోజుల రిమాండ్ మీద జైల్లో ఉన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇతర పార్టీలు కూడా కొన్ని టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నాయి. జాతీయ నేతలు కూడా కొంతమంది చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. కానీ ఎన్టీఆర్ మౌనం చర్చకు దారితీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరి ఇప్పుడు తన మేనత్త, చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి చెబితే ఎన్టీఆర్ వింటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. జైల్లో చంద్రబాబును కలిసి తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ఇది కష్టకాలమని అన్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ నిర్మించిన టీడీపీ ఎక్కడికీ వెళ్లదని.. క్యాడర్, ప్రజల కోసం తమ కుటుంబం ఎప్పుడూ పోరాడి నిలుస్తుందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో కుటుంబం గురించి భువనేశ్వరి పదేపదే ప్రస్తావించడం ఇక్కడ గమనించాల్సిన అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు విషయంలో నందమూరి కుటుంబం కూడా కలిసి రావాలన్నది ఆమె ఉద్దేశంగా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది.

మరి ఎంతమంది డిమాండ్ చేసినా ఇప్పటివరకూ సైలెంట్గా ఉన్న ఎన్టీఆర్.. మేనత్త పిలిస్తే వెళ్తారా? అన్నది ఇక్కడ ప్రశ్న. గతంలో టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారం చేశారు. కానీ లోకేష్ కోసం ఎన్టీఆర్ ను బాబు పక్కనపెట్టారనే విమర్శలున్నాయి. అప్పటి నుంచే పార్టీకి, బాబుకు దూరంగా ఎన్టీఆర్ ఉంటున్నారని చెబుతున్నారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News