2024లో చూడాల్సిన సినిమా.. బరాక్ ఒబామా సిఫార్సు
2024 సినిమాల్లో సిఫార్సుల జాబితాలో ఈ సినిమాని చేర్చానని ఒబామా తాజా ప్రకటనలో తెలిపారు.
పాయల్ కపాడియా 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు గెలుచుకుంది. క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించింది. ఇది మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మెప్పు పొందింది. 2024 సినిమాల్లో సిఫార్సుల జాబితాలో ఈ సినిమాని చేర్చానని ఒబామా తాజా ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళా ప్రేమికులకు సిఫార్సుగా తనకు ఇష్టమైన సినిమాలు, పుస్తకాలు, మ్యూజిక్ లిస్ట్ ని ఆయన రివీల్ చేసారు.
ఈ ఏడాదిలో ఒబామాకు ఇష్టమైన సినిమాల విషయానికొస్తే.. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలకు నామినేట్ అయిన 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' అతడి వార్షిక సిఫార్సుల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. తన X లో ఈ విషయాన్ని పోస్ట్ చేసారు ఒబామా. ఈ సంవత్సరం ప్రజలు చూడాలని నేను సిఫార్సు చేయదలిచిన కొన్ని సినిమాలు ఇక్కడ ఉన్నాయి.. అంటూ జాబితాను రివీల్ చేసారు. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సహా ఇతర చిత్రాలలో డెనిస్ విల్లెనెయువ్ - డూన్ పార్ట్ 2, సీన్ బేకర్ - అనోరా, ఎడ్వర్డ్ బెర్గెర్స్ -కాన్‌క్లేవ్, మాల్కం వాషింగ్టన్ -ది పియానో లెసన్ సినిమాలు ఉన్నాయి.
గ్లోబల్ వేదికపై భారత్ నుంచి 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' సత్తా చాటింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డును దక్కించుకోవడమేగాక, గడిచిన 30ఏళ్లలో కేన్స్ లో ప్రధాన పోటీ విభాగంలో ప్రదర్శించిన మొదటి భారతీయ చిత్రంగా ఇది రికార్డులకెక్కింది. 1994 తర్వాత మళ్లీ ఈ ఘనత సాధ్యమైంది.
ఆల్ వి ఇమేజిన్ యూజ్ లైట్ చిత్రం ప్రపంచ వేదికపై ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో ప్రవేశించేందుకు నామినేషన్లను అందుకుంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీగా.. ప్రఖ్యాత గోతం అవార్డ్స్ 2024లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలింగా పురస్కారాల్ని గెలుచుకుంది. 29వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK)లో పాయల్ స్పిరిట్ ఆఫ్ సినిమా అవార్డును అందుకున్నారు. ఇద్దరు నర్సుల లవ్ లైఫ్ కి సంబంధించిన కథతో రూపొందించిన 'ఆల్ వి ఇమేజిన్ యూజ్ లైట్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ , హృదు హరూన్ తదితరులు నటించారు. మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.