నవీన్ పట్నాయక్ వారసుడు రెడీ...?
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాక్ ఇప్పటికి 23 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాక్ ఇప్పటికి 23 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయిదు సార్లు వరసగా ఎన్నికల్లో గెలిచారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో మరోసారి ఆయన నాయకత్వం వహిస్తున్న బిజూ జనతాదళ్ గెలుస్తుంది అని అంటున్నారు. అదే జరిగితే ఆయన మరో అయిదేళ్ళ పాటు సీఎం గా ఉంటారు. ఇప్పటికి పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం దివంగత నేత జ్యోతి బాస్ అయిదు సార్లు సీఎం గా వరసగా పనిచేశారు.
ఆయన మొత్తం 23 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జ్యోతి బాస్ రికార్డుని ఇప్పటికే నవీన్ పట్నాయక్ దాటేశారు. మరోసారి గెలిస్తే దేశంలో అత్యధిక కాలం సీఎం గా ఉన్న రికార్డు ఆయనకే సొంతం అవుతుంది. అయితే ఈ రోజుకు నవీన్ పట్నాయక్ వయసు 77 ఏళ్ళు. ఆయన వచ్చే ఏడాది ఆరవసారి సీఎం అయ్యేనాటికి 78 ఏళ్ళ వారు అవుతారు.
మరి ఫుల్ టెర్మ్ ఆయన కంటిన్యూ అవుతారా లేదా అన్న చర్చ ఉంది. నవీన్ పట్నాయక్ బ్రహ్మ చారి. ఆయనకు సొంత కుటుంబం నుంచి వారసులు ఎవరూ లేరు. అయితే ఆయ ఆశయాలకు వారసులు ఉన్నారు. వారి నుంచే ఒకరిని తెచ్చి తన వారసుడిగా నవీన్ పట్నాయక్ ప్రకటిస్తారు అని అంటున్నారు.
అందులో అగ్ర తాంబూలం అయనకు పదేళ్ల పాటు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వీకే పాండియన్ దే అని అంటున్నారు. ఆయన విషయంలో నవీన్ పట్నాయక్ సడెన్ గా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి దాకా ముఖ్యమంత్రికి నమ్మిన బంటుగా ఉన్న పాండియన్ ని తీసుకుని వచ్చి ఏకంగా రాష్ట్ర కేబినెట్ ర్యాంక్ మంత్రిగా నవీన్ చేశారు.
దీంతో నవీన్ రాజకీయ వారసుడు ఎవరో తేలిపోయింది అని అంటున్నారు. ఇక పాండియన్ విషయానికి వస్తే ఆయన 2000 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. ఆయన తాజాగా స్వచ్ఛంద పదవీ విమరణ తీసుకున్నారు. దీనికి సోమవారమే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. అలా అనుమతి రావడమేంటి ఇల్లా ఒక్క రోజులోనే ఒడిశా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సురేంద్ర కుమార్ ఆయనను క్యాబినేట్ ర్యాంక్ మంత్రిగా ఒక ప్రత్యేక హోదాలో నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అలా పాండియన్ ను రాష్ట్ర కేబినెట్ మినిస్టర్ ర్యాంకులో ‘5టీ’ చైర్మన్ గా నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సీఎం నవీన్ వద్ద పాండ్యన్ కి ఉన్న విలువ ఏంటో తెలుస్తోంది అంటున్నారు. 2011 నుంచి నవీన్ పట్నాయక్ కు సహాయకుడిగా పాండియన్ పనిచేశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ లో పాండియన్ రాష్ట్రమంతా చుట్టి రావడం విమర్శలకు తావిచ్చింది.
ఇక ఒడిషా ప్రభుత్వంలోని శ్రీమందిర్ పరిక్రమ ప్రాజెక్ట్, బీజూ స్వాస్త్య కల్యాణ్ యోజన తదితర కార్యక్రమాల రూపకల్పనలో పాండియన్ కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అలాగే, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో మార్పులకు కీలకంగా పనిచేశారు.
ఇపుడు ఆయన క్యాబినేట్ హోదాతో అత్యంత శక్తిమంతుడిగా నవీన్ ప్రభుత్వంలో రుజువు చేసుకున్నారు అని అంటున్నారు. ఇక పాండియన్ నియామకం పట్ల సొంత పార్టీలో చర్చ ఒక లెవెల్ లో సాగుతూంటే విపక్షాలు కూడా తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
ఈ తాజా పరిణామంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శలు చేశారు. నిన్నటి దాకా అనధికారికంగా చేసింది ఇప్పుడు అధికారికంగా మారిందంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. పట్నాయక్ కనిపించని భూస్వామి కావడంతో ఒడిశాలో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్య సహాయకుడు రాష్ట్ర సీఈవోగా వ్యవహరిస్తున్నాడు అంటూ అందులో పేర్కొన్నారు.
మొత్తానికి చూస్తే వీకే పాండియన్ నవీన్ కి కుడి భుజంగా ఉన్నారని అంటున్నారు. అటు ప్రభుత్వం ఇటు పార్టీ వ్యవహారాల్లో ఆయనే కీలకంగా మారుతున్నారని అంటున్నారు. మరి ఇదే నిజమైతే 2024 ఎన్నికల తరువాత నవీన్ తరఫున వారసుడిగా సీఎం పదవికి పాండియన్ గట్టి పోటీ అవుతారా అన్న చర్చ అయితే ఉంది మరి.