ఏపీలో మ‌ళ్లీ పాత జిల్లాలేనా... కూట‌మిలో కొత్త చ‌ర్చ‌...!

దీంతో రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు ఏర్ప‌డ్డాయి. చాలా వ‌ర‌కు బాగానే ఉన్నా.. అన్న‌మ‌య్య‌, శ్రీస‌త్య‌సాయి, కోన‌సీమ వంటి జిల్లాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటు వివాదంగా మారింది.

Update: 2024-12-01 19:30 GMT

రాష్ట్రంలో వైసీపీ హ‌యాంలో తీసుకున్న కొన్నినిర్ణ‌యాల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స‌హా.. చెత్త‌పై ప‌న్ను వంటివి ర‌ద్దు చేశారు. అలానే ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచిన మ‌ద్యం దుకాణాల‌ను ప్రైవేటుకు ఇచ్చారు. ఇసుక పాల‌సీని ర‌ద్దు చేసిన కూట‌మి ప్ర‌భుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువ‌చ్చింది. అలానే గ్రామ వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌పై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌తో ఉంది. దాదాపు ఇది కూడా రద్ద‌యినా.. ప్ర‌క‌ట‌న చేయ‌డంలో వెనుకాడుతున్న ప‌రిస్థితి ఉంది.

ఇలా.. జ‌గ‌న్ హ‌యాంలో తెచ్చిన అనేక విష‌యాల్లో కూట‌మి మార్పుల దిశ‌గా అడుగులు వేస్తోంది. తాజాగా ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో చేసిన జిల్లాల ఏర్పాటును కూడా.. ర‌ద్దు చేసే దిశ‌గా అడుగులు ప‌డుతుండ డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించి కూట‌మిలో లోతైన చ‌ర్చే జ‌రుగుతోంది. జ‌గ‌న్ హ‌యాంలో అప్ప‌టి 13 జిల్లాల‌ను పార్ల‌మెంటు సెగ్మెంట్ కేంద్రంగా ఒక జిల్లాగా గుర్తిస్తూ.. 26 జిల్ల‌ల‌ను చేశారు. నిజానికి 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నా.. విశాఖ‌లో పెద్ద నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌డంతో వాటిని రెండుగా విభ‌జించారు.

దీంతో రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు ఏర్ప‌డ్డాయి. చాలా వ‌ర‌కు బాగానే ఉన్నా.. అన్న‌మ‌య్య‌, శ్రీస‌త్య‌సాయి, కోన‌సీమ వంటి జిల్లాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటు వివాదంగా మారింది. అన్న‌మ‌య్య జిల్లాను రాజంపేట కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని, శ్రీస‌త్య‌సాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా, కోన‌సీమ‌కు అంబేడ్క‌ర్ పేరు పెట్టాల‌న్న డిమాండ్లు వినిపించాయి. కోన‌సీమ వివాదం దేశ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక‌, మ‌ద‌న‌ప‌ల్లెను ప్ర‌త్యేక జిల్లాగా గుర్తించాల‌న్న డిమాండ్ ఇప్ప‌టికీ ఉంది.

అదేవిధంగా ప‌ల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాల‌ని అక్క‌డి వారు కోరుతున్నారు. ఇలా.. వైసీపీ చేసిన జిల్లాల విభ‌జ‌న వివాదాల‌కు దారితీసింది. ఇక‌, క‌లెక్ట‌ర్‌, ఐపీఎస్ అధికారుల‌కు భ‌వ‌నాలు సొంతంగా లేక‌పోవ‌డం మ‌రో చిక్కుగా మారింది. ప్ర‌స్తుతం చాలా జిల్లాల్లో అద్దె భ‌వ‌నాల్లోనే ఇవి సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు కొత్త జిల్లాల ద్వారా ప్ర‌యోజ‌నం క‌ట్టే ఇబ్బందులే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. మంత్రులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని.. కొత్త జిల్లాల‌ను ర‌ద్దు చేసే దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News