సరిగ్గా నెల.. మరి అమెరికా ఎన్నికల్లో గెలుపెవరది? తాజా అంచనా ఇదే

అలాంటి అమెరికాలో నవంబరు 5న అధ్యక్ష ఎన్నిక జరిగే సమయం దగ్గరపడుతోంది. చూస్తూచూస్తుండగానే నాలుగేళ్ల కాలం గడిచిపోయింది.

Update: 2024-10-08 02:30 GMT

అమెరికా అంటే అందరికీ కలల రాజ్యం.. డాలర్ల వర్షం కురిసే సంపన్న రాజ్యం.. ఉద్యోగం.. ఉపాధి.. వ్యాపారం.. చదువు.. ఇలా భవిష్యత్ ను వెదుక్కొంటూ లక్షలమంది డాలర్ డ్రీమ్స్ ను కంటుంటారు.. అలాంటి అమెరికాలో నవంబరు 5న అధ్యక్ష ఎన్నిక జరిగే సమయం దగ్గరపడుతోంది. చూస్తూచూస్తుండగానే నాలుగేళ్ల కాలం గడిచిపోయింది. గత ఎన్నికల్లో అందరూ ట్రంప్ కచ్చితంగా గెలుస్తారని భావించగా.. అనూహ్యంగా జో బైడెన్ ను విజయం వరించింది. అప్పుడే తాను మళ్లీ బరిలో దిగుతానని ట్రంప్ ప్రకటించారు. దానిని నిజం చేస్తూ రంగంలో నిలిచిన ఆయన బైడెన్ తప్పుకొని భారత మూలాలున్న కమలా హారిస్ ప్రత్యర్థిగా నిలిచారు.

దూకుడైన ట్రంప్ .. తెలివైన కమల

అమెరికా ఎన్నికల ప్రచార శైలిని చూస్తుంటే.. యథాప్రకారం రిపబ్లికన్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. డెమోక్రాట్ కమలా హారిస్ మాత్రం తెలివిగా వెళ్తున్నట్లు అర్థం అవుతోంది. ఇక అమెరికా ఓటర్లు చాలామంది రిపబ్లికన్.. డెమోక్రాట్ ఇలా ఏ పార్టీకి మద్దతు ఇస్తామో ముందే చెప్పేస్తారు. ఆయా పార్టీల గుర్తింపునూ పొందుతారు కొందరు. దీంతోనే 50 రాష్ట్రాలకు గాను ఎక్కడ రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు మద్దతు ఎంత ఉందనేది స్పష్టం అవుతుంది. అయితే, ఇది అంచనానే. ఇలానే అందరూ ఓటు వేస్తారని భావించలేం. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు తటస్థంగా ఉంటారు.

స్వింగ్ జర స్వింగ్ జర..

అమెరికా ఎన్నికల్లో ప్రజలు ఈ సారి ఏ పార్టీ వైపు మొగ్గుచూపని రాష్ట్రాలుగా కొన్నిటిని భావిస్తున్నారు. ఇలాంటివి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చేస్తుంటాయి. కాబట్టి స్వింగ్‌ రాష్ట్రాలుగా పిలుస్తుంటారు. అలా నవంబరు 5న జరిగే ఎన్నికల్లో పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్‌ కరోలినా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలను స్వింగ్‌ రాష్ట్రాలుగా భావిస్తున్నారు. ప్రజలు వేసే ఓట్లతో ఆయా రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎంచుకుంటారు. వీరిని ఎలక్టోరల్‌ కాలేజీ అంటారు. రాష్ట్రాల జనాభా ఆధారంగా ఈ సీట్లుంటాయి. అమెరికా అంతటా 538 ఎలక్టోరల్‌ కాలేజీ స్థానాలున్నాయి. సగం.. అంటే 270 నెగ్గినవారు అధ్యక్షులు అవుతారు. పైన చెప్పిన పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్‌ కరోలినా, విస్కాన్సిన్‌ లలో 93 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లున్నాయి. దీంతో ట్రంప్, కమలా వీటిపై గట్టిగా ఫోకస్ పెట్టారు.

పోలీ మార్కెట్ అంచనా ఏమంటే..?

స్వింగ్ రాష్ట్రాల కథ ఎలా ఉన్నా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది అని ‘పోలీ మార్కెట్’ అంచనా వేసింది. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం ఎవరు గెలుస్తారో చెప్పుకొచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రెడిక్షన్ మార్కెట్ గా దీనికి పేరుంది. ఇంకా 31 రోజులు ఉండగానే పోలీ మార్కెట్ వేసిన అంచనా ప్రకారం అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలు 50.01 శాతంగా పేర్కొంది. కమలా 48.09 వద్దనే ఆగిపోయారు. కాగా, ఇది అంచనా మాత్రమే. నిజం కావాలని ఏమీ లేదు. ప్రచార శైలిని చూస్తుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా వైపే మొగ్గుందని గతంలో నివేదికలు వచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News