ఇక నుండి ఆన్ లైన్లోనూ నామినేషన్లు
ఇప్పటివరకు పోటీచేయదలచుకున్న అభ్యర్ధులు డైరెక్టుగా రిటర్నింగ్ అధికారులను కలిసి ఫిజికల్ గా తమ నామినేషన్ పత్రాలను అందచేస్తున్నారు.
నామినేషన్ల దాఖలు విషయంలో కేంద్ర ఎన్నికల కమీషన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధులు ఆన్ లైన్లో కూడా నామినేషన్లను దాఖలు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు పోటీచేయదలచుకున్న అభ్యర్ధులు డైరెక్టుగా రిటర్నింగ్ అధికారులను కలిసి ఫిజికల్ గా తమ నామినేషన్ పత్రాలను అందచేస్తున్నారు. ఇప్పుడంటే చాలావరకు గొడవలు తగ్గిపోయాయి కాబట్టి ఇబ్బందులు ఉండటంలేదుకాని సార్వత్రిక ఎన్నికల సమయంలో అభ్యర్ధులందరు స్వేచ్చగానే తమ నామినేషన్లు వేయగలుగుతున్నారు.
ఒకపుడు నామినేషన్లను వేయటానికి వచ్చిన అభ్యర్ధుల్లో ఒకళ్ళని మరొకళ్ళు చాలా ఇబ్బందులు పెట్టిన సంఘటనలున్నాయి. చివరకు నామినేషన్లు వేయనీయకుండా అభ్యర్ధులను కిడ్నాప్ చేసిన ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటిది కాలంమారటంతో ఇపుడు అంతటి సమస్యలు తలెత్తటంలేదు. అయినా నామినేషన్లను ఆన్ లైన్లో దాఖలు చేసే సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ కల్పించటం సంతోషించాల్సిన విషయమే. అయితే ఇక్కడే కమీషన్ చిన్న మెలిక పెట్టింది. అదేమిటంటే ఆన్ లైన్లో నామినేషన్లు దాఖలుచేసిన అభ్యర్ధులు గడువు ముగిసేలోగా డైరెక్టుగా రిటర్నింగ్ అధికారి దగ్గరకు వచ్చి ఫిజికల్ గా కూడా నామినేషన్ పత్రాలను అందించాల్సుంటంది.
ఎందుకంటే ఆన్ లైన్లో ఎవరి తరపున ఎవరు నామినేషన్లు దాఖలుచేస్తున్నారో తెలీదు కాబట్టి. ఆన్ లైన్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయటం, నిర్ణీత డబ్బులు కట్టడం, ప్రపొజర్ల సంతకాలు ఉండటం అన్నీ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లోనే ఉండాలి. నిబంధనల ప్రకారమే సువిధ.ఇసీఐ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్లో పత్రాలను అపలోడ్ చేయాలి.
తర్వాత ఆన్ లైన్లోనే అక్నలెడ్జిమెంట్ కూడా వస్తుంది. దాన్ని పట్టుకుని ఫిజికల్ గా అభ్యర్ధులు రిటర్నింగ్ అధికారిని కలిసి అక్నాలెడ్జిమెంటును చూపించి రెండోసారి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సుంటంది. అప్పుడే సదరు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వ్యాలీడ్ గా గుర్తిస్తారు. ఏదేమైనా మొదటిసారి ఆన్ లైన్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసే వెసులుబాటును కమీషన్ కల్పించింది. ఇంతకుముందే వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు తమ ఓట్లను ఇళ్ళనుండి ఆన్ లైన్లో దాఖలు చేసే సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే.