అదేంటి సర్.. షర్మిలను అంత మాటనేశారు?!
దివంగత సీఎం వైఎస్ తనయ వైఎస్ షర్మిలపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
"షర్మిల ఏమైనా తోపా.. ఆమెవరో నాకు తెలీదు.. వైఎస్ బిడ్డయితే ఏంటి?"- అంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్, దివంగత సీఎం వైఎస్ తనయ వైఎస్ షర్మిలపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఒకప్పుడు అదే వైఎస్‌తో ఒవైసీ వారానికి నాలుగు సార్లు భేటీ అయ్యారు. మైనారిటీ ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై ఒవైసీకూడా అప్పట్లో సలహాలు ఇచ్చారు. అలాంటి వైఎస్ కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిని పట్టుకుని ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తినిరేపాయి.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉన్న షర్మిల పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన అసదుద్దీన్.. షర్మిల ఎవరో తనకు తెలియని వ్యాఖ్యానించారు. "షర్మిల ఎవరో నాకు తెలియదు... ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదో తెలియదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయితే తోపా... అది ప్రజలు నిర్ణయిస్తారు" అని అన్నారు.
బీఆర్ఎస్ గెలుపు రాసిపెట్టుకోండి!
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలుపు ఖాయమని ఒవైసీ చెప్పారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ ఎస్ పాలన కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు సుభిక్షంగా ఉన్నాయని ఒవైసీ అన్నారు. తమ మద్దతు బీఆర్ ఎస్‌కే ఉంటుందని చెప్పారు. బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంబర్ పేట నుంచి పోటీ చేయకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. బీసీని సీఎంను చేస్తామని చెబుతున్న బీజేపీ.. అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు తొలగించారని నిలదీశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం సీటు కోసం కాంగ్రెస్ నేతలు.. జుట్టు జట్టు పట్టుకుంటున్నారని ఒవైసీ అన్నారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కాగా, బీఆర్ ఎస్‌కు ఎంఐఎం మద్దతిస్తున్న విషయం తెలిసిందే.