ఏమిటీ ఓజెంపిక్? టాప్ సెలబ్రిటీలు ఎందుకు వాడుతున్నారు?

ఒక మెడిసిన్ ను అత్యంత ప్రముఖులు వాడుతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ నుంచి టాప్ సెలబ్రిటీలు ఇప్పుడు ‘ఒజెంపిక్’ అనే మెడిసిన్ వాడుతున్నారు.

Update: 2023-08-06 06:06 GMT

ఒక మెడిసిన్ ను అత్యంత ప్రముఖులు వాడుతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ నుంచి టాప్ సెలబ్రిటీలు ఇప్పుడు ‘ఒజెంపిక్’ అనే మెడిసిన్ వాడుతున్నారు. ఇంతకూ ఈ మెడిసిన్ ప్రత్యేకత ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు? దాని వల్ల కలిగే ఉపయోగం ఏమిటి? లాంటి ప్రశ్నలు చర్చగా మారాయి. ఎవరికి వారుగా సెలబ్రిటీలను అంతలా ఆకర్షిస్తున్న ఈ మెడిసిన్ వల్ల ప్రయోజనం ఏమిటన్నది చూస్తే.. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గే దివ్య ఔషధంగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

టైప్ 2 డయాబెటిస్ ప్రభావాన్ని ఈ మెడిసిన్ తగ్గిస్తుందని చెబుతున్నారు. వారానికి ఒకసారి ఈ మెడిసిన్ ను వాడితే.. తమ శరీర బరువులో సుమారు పది శాతం తగ్గించుకోవచ్చని ఒక రీసెర్చ్ లో తేలింది. టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడుతున్న వారికి అయితే ఇదో అత్యుత్తమ మందుగా నిపుణులు కొందరు పేర్కొంటున్నారు.

మెదడులోని ఆకలి కేంద్రాలను ప్రభావితం చేయటం ద్వారా బరువును తగ్గించి.. దాన్ని అదుపులోకి ఉంచేందుకు సహకరిస్తుందన్న మాట చెబుతున్నారు. మరింత వివరంగా చెప్పాలంటే.. ఈ మందు గ్లూకోగాన్ లాంటి పెప్టైడ్ 1 రిసెప్టర్ అగోనిస్ గా చెబుతున్నారు. ఇది శరీరమంతా జీఎల్ పీ 1 గ్రాహకాలను యాక్టివేట్ చేసి.. వాటి ప్రభావాల్ని మెరుగుపరుస్తుందని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లు చెబుతున్నారు. ఈ మెడిసిన్ ను డానిష్ ఫార్మాస్యూటికల్ సంస్థకు చెందిన నోవో నార్డిస్క్ తయారుచేసింది.

2017లో దీన్ని షుగర్ జబ్బుతో బాధ పడుతున్న వారు ఉపయోగించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. 2021 నుంచి బరువు తగ్గటం కోసం దీన్ని ఆమోదించారు. అప్పటి నుంచి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మొదలు పలువురు నటీనటులు.. సెలబ్రిటీలు ఇలా ప్రముఖులంతా ఈ మందును తీసుకుంటున్నారు.

ప్రధానంగా ఎలాన్ మస్క్ పుణ్యమా అని ఈ మెడిసిన్ పాపులర్ అయ్యింది. వైగోవి బ్రాండ్ తో అమ్మే ఓజెంపిక్ మందును తాను తీసుకుంటున్నట్లుగా మస్క్ సైతం ఒక సందర్భంలో వెల్లడించారు. అయితే.. దీనిపై విమర్శలు లేకపోలేదు. ఓజెంపిక్ ను వారానికి ఒకసారి ఇంజెక్టు చేసే మందు అని.. అయితే ఇదేమీ అద్భుతమైన మెడిసిన్ ఏమీ కాదంటున్నారు. మొత్తంగా ఈ మెడిసిన్ ను వాడమని చెప్పట్లేదు. ఇది కేవలం సమాచారం కోసం అందిస్తున్న వార్తాంశమే తప్పించి.. దీని ప్రభావంతో ఆ మెడిసిన్ వాడాలన్న ప్రయత్నాలు చేయొద్దు. వైద్యుల్ని సంప్రదించి.. వారిచ్చిన సలహాల మేరకు మాత్రమే తుది నిర్ణయాన్ని తీసుకోవాలి.

Tags:    

Similar News