'ఎగ్జిట్ పోల్స్'ను కొనేస్తారా? పార్టీలకు ఆ అవసరమేంటి?

సార్వత్రిక ఎన్నికలపైనా.. కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ శనివారం వెల్లడి కావటం తెలిసిందే

Update: 2024-06-02 04:41 GMT

సార్వత్రిక ఎన్నికలపైనా.. కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ శనివారం వెల్లడి కావటం తెలిసిందే. దీనికి సంబంధించి ఒక కొత్త మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అదేమంటే.. ఎగ్జిట్ పోల్స్ ఫర్ సేల్ అని. అంచనాలకు మించిన రీతిలో వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ అంటూ వెల్లడించటం.. అందులో ఏ పార్టీకి విజయవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని వెల్లడించాయి. ఇందులో నిజమెంత? అబద్ధమెంత? అన్నది తేలాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే. హోరాహోరీగా సాగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్ని చూస్తే.. ఈసారి ఏ పార్టీ విజయాన్ని సాధిస్తుందన్న దానిపై కొంత కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే.

సార్వత్రిక ఎన్నికలపై వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒకేలాంటి అంచనాల్ని వెల్లడించాయి. అందుకు భిన్నంగా ఏపీ మీద అంచనాలు వేరుగా ఉన్నాయి. ఇలా ఎందుకు జరిగింది? గ్రౌండ్ లెవల్ లో తీసుకునే శాంపిళ్లు.. శాస్త్రీయ పద్దతులతో చేపట్టే ఎగ్జిట్ పోల్స్ లో మరీ ఇంత వేరియేషన్ ఎందుకు ఉన్నట్లు? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఏపీ ఫలితాలపై దాదాపు మూడు డజన్ల సంస్థలు తమ అంచనాల్ని వెల్లడించాయి. ఇంత ఆసక్తి ఎందుకంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి తాజా ఆసక్తి.. ఏపీ అసెంబ్లీ ఫలితాల మీదే ఉండటం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఒక కొత్త మాట మీడియా సర్కిల్స్ లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. పెయిడ్ న్యూస్ మాదిరి.. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ ఈసారి వెల్లడయ్యాయని మాట వినిపిస్తోంది. దీనికి సాక్ష్యం.. ఆధారం ఏమీ లేకున్నా.. వెల్లడైన అంచనాల్లోని వైరుధ్యమే ఈ చర్చకు కారణమని చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణపై మరో ఆసక్తికర వాదన వినిపిస్తుంది.

ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా.. అసలుసిసలైన వాస్తవం మూడు రోజుల్లో బయటకు రానున్న వేళ.. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ అవసరమేంటి? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి కొందరి వాదన ఆసక్తికరంగానే కాదు.. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ వాదనను నమ్మే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ కాన్సెప్టు ఎందుకు షురూ అయ్యిందన్న ప్రశ్నకు కొందరు బదులిస్తూ.. ఎగ్జిట్ పోల్స్ తో తాము సమర్థించే పార్టీ క్యాడర్ కు మనోధైర్యాన్ని కల్పించటం.. కీలకమైన ఓట్ల లెక్కింపు వేళ.. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే వారు మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేందుకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టానిక్ మాదిరి పని చేస్తాయంటున్నారు.

అందుకే.. తుది ఫలితం ఎలా ఉన్నా.. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే క్యాడర్ లో ధైర్యం నింపేందుకు వీలుగా ఈ మైండ్ గేమ్ కు తెర తీసినట్లుగా చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే నిలదీయటం ఉండదు. మహా అయితే.. ఇమేజ్ కాస్తంత డ్యామేజ్ అవుతుంది. తర్వాత వేరే చోట్ల జరిగే ఆసక్తికర ఎన్నికల అంచనాల్ని కరాఖండిగా వెల్లడించటం ద్వారా ఇమేజ్ డ్యామేజ్ ను కంట్రోల్ చేయొచ్చని చెబుతున్నారు. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ కోసం ఏపీకి చెందిన పలువురు నేతలు వ్యక్తిగతంగా భారీ ఎత్తున ఖర్చు చేశారని.. ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు పెట్టటం మరే రాష్ట్రంలో లేదన్న మాట వినిపిస్తోంది. దేశ రాజకీయాల్లో దరిద్రపుగొట్టు ట్రెండ్ లకు నెలవుగా తెలుగు రాష్ట్రాలు ఉంటాయని చెబుతుంటారు. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ కాన్సెప్టు సైతం ఇదే కోవకు చెందిందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News