నాటి అబోటాబాద్ లా'డెన్'.. ఇప్పుడు ఉగ్రవాదుల ఫ్యాక్టరీ
2001 సెప్టెంబరు 11.. అమెరికా అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న రోజులు.. అలాంటి దేశంపై అనూహ్యంగా దాడి జరిగింది.
2001 సెప్టెంబరు 11.. అమెరికా అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న రోజులు.. అలాంటి దేశంపై అనూహ్యంగా దాడి జరిగింది. చరిత్రలోనే అతి భయంకర దాడిగా ఇది నిలిచిపోయింది. దీని వెనుక ఉన్నది అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ అని తర్వాత తేలింది. అఫ్ఘానిస్థాన్ కేంద్రంగా అతడు సాగించిన ఉగ్ర కార్యకలాపాలు ప్రపంచాన్నే వణికించాయి. తమ దేశంపై దాడి జరిగిన మరుసటి క్షణం నుంచే వేట మొదలుపెట్టిన అమెరికా.. అఫ్ఘానిస్థాన్ లో కాలుపెట్టింది. కానీ.. పదేళ్ల పాటు లాడెన్ ను పట్టుకోలేపోయింది.
సుదీర్ఘ వేటతో..
2001లో అమెరికా ఆర్థిక రాజధాని న్యూయ్యార్క్ లోని ట్విన్ టవర్స్ పై దాడి జరిగితే.. అమెరికా 2011లో కాని బిన్ లాడెన్ మట్టుపెట్టలేకపోయింది. 2011 మే నెలలో లాడెన్ జాడను కచ్చితంగా కనిపెట్టిన అమెరికా తిరుగులేని రీతిలో దాడి చేశాయి. నాడు అమెరికా నేవీ సీల్స్ ఈ దాడికి నాయకత్వం వహించాయి. ఇందులో లాడెన్ ఏమాత్రం తప్పించుకోలేని రీతిలో చుట్టుముట్టాయి. అతడిని హతమార్చింది ఎక్కడో తెలుసా..? పాకిస్థాన్ లోని అబోట్టాబాద్ లో. అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతం.. లాడెన్ ను హతమార్చిన తర్వాత చాలా పాపులర్ అయింది. అయితే, దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఏకంగా ఉగ్రవాద ఫ్యాక్టరీ
నాడు లాడెన్ ఆశ్రయం పొందిన ప్రాంతంగా నిలిచిన అబోట్టాబాద్ ఇప్పుడు పాకిస్థాన్ ఏకంగా ఉగ్రవాద పరిశ్రమనే నడుపుతోంది. దీన్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాదు.. పాకిస్థాన్ సైన్యంలోని కీలక జనరల్ ఒకరు ఈ ఉగ్ర శిబిరానికి పర్యవేక్షకుడిగా ఉన్నాడు. ఇది ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిలో మెగా టెర్రర్ ఫ్యాక్టరీగా ఉందట. కాగా, ఈ శిబిరంలో నిషేధిత ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ లు పాకిస్థాన్ సైనిక స్థావరం పక్కనే ఓ ఉమ్మడి ట్రైనింగ్ క్యాంప్ ను ఏర్పాటు చేశాయట. బయటి వ్యక్తులు వీటిలోకి అడుగుపెట్టడం అసాధ్యం.
సాయుధ శిక్షణ..
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన జనరల్ పర్యవేక్షలో.. టెర్రర్ క్యాంప్ లో యువకులు, యువతులకు ఆయుధ వినియోగం, ఇతర ఉగ్ర కార్యకలాపాల్లో శిక్షణ కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, అబోట్టాబాద్ లోనే బిన్ లాడెన్ ఏ దుర్బేధ్యమైన ఇంటిలో నక్కిన సంగతి తెలిసిందే. 2011 మే నెలలో అమెరికా నేవీ సీల్స్ హెలికాప్టర్లలో వచ్చి లాడెన్ ను చంపేశాయి. పాకిస్థాన్ గడ్డపై జరిగిన ఈ ఆపరేషన్ గురించి ఆ దేశానికే సమాచారం ఇవ్వలేదంటే ఎంత రహస్యంగా ఆపరేషన్ సాగించారో తెలుస్తోంది. అయితే, లాడెన్ సంగతి తమకూ తెలియదని పాకిస్థాన్ బుకాయించింది.
నాడు లాడెన్.. ఉగ్ర డెన్..
లాడెన్ నివసించిన తర్వాతి కాలంలో పాక్ పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే, తన బుద్ధి చాటుకుంది. అదే స్థలంలో పాక్ సైన్యం కొత్తగా ఉగ్రవాద శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది. ఈ వివరాలపై మరింత స్పష్టత రావాల్సిఉంది. ఆయా ఉగ్రవాద సంస్థల అధినేతలు హఫీజ్ సయీద్, మసూద్ అజర్, సయ్యద్ సలాహుద్దీన్ లు కూడా అబోట్టాబాద్ క్యాంప్ కు వచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. ఇది పాకిస్థాన్ లోనే అతిపెద్ద టెర్రర్ క్యాంప్ గా చెబుతున్నారు. భయంకర ఉగ్ర సంస్థలు లష్కరే, జైషే, హిజ్బుల్ ముజాహిదిన్ లు ఇక్కడే నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగాయి. దీంతో అబోట్టాబాద్ శిబిరం విషయం వెలుగులోకి రావడం గమనార్హం.