చిన్న ప్రావిన్స్ సెనేటర్ నుంచి ఆపద్ధర్మ ప్రధానిగా?

Update: 2023-08-13 16:30 GMT

పాకిస్థాన్ లో చోటు చేసుకున్న రాజకీయ అనిశ్చిత ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఆ దేశ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశంలోనే చిన్నదిగా చెప్పే ఒక ప్రావిన్స్ కు సెనేటర్ గా వ్యవహరించే ఆయన్ను ఏకంగా దేశ ఆపద్ధర్మ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టటం. ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ప్రతిపక్షనేత రజా రియాక్ జరిపిన చర్చలు ఒక కొలిక్కి వచ్చి.. ఇద్దరు ఓకే చెప్పిన కాకర్ ను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను పాక్ ప్రధాని కార్యాలయం విడుదల చేసింది.

ఆగస్టు తొమ్మిదిన పాక్ జాతీయ అసెంబ్లీని ప్రధాని రద్దు చేయటంతో ఆపద్ధర్మ ప్రధానమంత్రి అవసరం ఏర్పడింది. దీంతో.. ఆ పదవికి చిన్న ప్రావిన్స్ కు చెందిన వ్యక్తి ఉండాలన్న విపక్ష నేత సూచనతో కాకర్ ఎంపికలోకి వచ్చారు. దీనికి ప్రధానిగా ఉన్న షెహబాజ్ సైతం ఓకే చెప్పటంతో.. పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఓకే చేశారు. ఇంతకీ ఈ కాకర్ ఎవరు? అతనికి ఈ అవకాశం ఎలా దక్కింది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

బెలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ విషయానికి వస్తే.. చిన్న ప్రావిన్స్ కు సెనేటర్. అయినప్పటికీ ఆయన ప్రాంతం తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. దీనికి కారణం.. ఆ ప్రాంతంలో తిరుగుబాట్లు ఎక్కువగా ఉండటంతో వార్తల్లో ఆ ప్రాంతం పేరు వినిపిస్తూ ఉంటుంది. తొలిదశలో కాకర్ విదేశాల్లో ఉండే పాక్ ప్రజల సంరక్షణ.. హ్యుమన్ రీసోర్స్ డెవలప్ మెంట్ పై ఏర్పాటైన సెనెట్ స్టాండింగ్ కమిటీకి ఛైర్మన్ గా పని చేశారు.

అనంతరం బెలూచిస్తాన్ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బెలూచిస్తాన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికై.. అనంతరం బెలూచిస్తాన్ అవామీ పార్టీలో చేరారు. ప్రస్తుతం సెనేట్ లో పార్లమెంటరీ లీడర్ గా ఉన్నారు. ఇలా చిన్న స్థానంలో ఉంటూ అనూహ్యంగా ఆపద్ధర్మ ప్రధానమంత్రి స్థానాన్ని చేపట్టే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. పెరిగిన జనాభాకు తగ్గట్లు నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే ఎన్నికలు నిర్వహిస్తారని చెబుతున్నారు. దీంతో.. షెడ్యూల్ ప్రకారం మూడు నెలల్లో జరగాల్సిన ఎన్నికలు మరింత ఆలస్యమవుతాయని తెలుస్తోంది.

Tags:    

Similar News