పల్లాకి ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పల్లా శ్రీనివాసరావుని నియమించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు

Update: 2024-06-14 13:34 GMT

ఉత్తరాంధ్రా మీద టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా ఉంది. అత్యంత కీలకమైన హోం మంత్రి పదవిని ఆ ప్రాంతానికి ఇచ్చిన టీడీపీ ఇపుడు మరో పెద్ద పదవికి అదే ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పల్లా శ్రీనివాసరావుని నియమించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఏపీలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారు పల్లా శ్రీనివాసరావు. ఆయన తాజా ఎన్నికల్లో గాజువాక నుంచి 94 వేల పై చిలుకు మెజారిటీని సొంతం చేసుకున్నారు.

ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అయితే అది వివిధ సామాజిక వర్గ సమీకరణల వల్ల దక్కలేదు. దాంతో పల్లాకు మరో కీలకమైన పదవిని చంద్రబాబు రెడీ చేశారు అని అంటున్నారు.

ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు పల్లాకు అప్పగించబోతున్నారు అని అంటున్నారు. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్ల కుటుంబం దశాబ్దాలుగా టీడీపీని అట్టేబెట్టుకుని ఉంది. ఆ కుటుంబం నుంచి పల్లా శిం హాచలం గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఆయన రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగిన పల్లా శ్రీనివాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ పట్ల విధేయత నిబద్ధత ఆయనకు ఉన్నాయి. యువకుడు ఉత్సాహవంతుడు కావడం విద్యాధికుడు కావడం ఆయనకు ఈ పదవి దక్కడానికి మరో కారణం అని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలో వరసగా బీసీ సామాజిక వర్గాలకే టీడీపీ ఈ పదవిని ఇస్తోంది. మొట్టమొదటగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయింది మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు. ఆ తరువాత కింజరాపు అచ్చెన్నాయుడు ఈ పదవిని అందుకున్నారు. ఇపుడు ఆయన రాష్ట్ర మంత్రిగా నియమితులు కావడంతో విశాఖ జిల్లాకు చెందిన పల్లాను ఈ పదవి కోసం ఎంపిక చేస్తున్నారు. బీసీ కాపులు, వెలమలు, యాదవులకు ఈ పదవిని కట్టబెట్టడం ద్వారా సామాజిక సమీకరణలలో తమకు సాటి లేదని టీడీపీ నిరూపించుకున్నట్లు అయింది అని అంటున్నారు.

Tags:    

Similar News