పల్లాకు గోల్డెన్ చాన్స్...దున్నేస్తారా ?

కానీ అదే సామాజికవర్గానికి చెందిన కొలుసు పార్ధసారధికి మంత్రి పదవి ఇవ్వడంతో పల్లాకు ఆ పదవి దక్కలేదు.

Update: 2024-06-28 03:43 GMT

విశాఖ జిల్లా గాజువాకకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఎమ్మెల్యేగా ఏపీలోనే అతయ్ధిక మెజారిటీతో గెలిచారు. ఆయనకు 94 వేల పై చిలుకు మెజారిటీ దక్కింది. దాంతో మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ అదే సామాజికవర్గానికి చెందిన కొలుసు పార్ధసారధికి మంత్రి పదవి ఇవ్వడంతో పల్లాకు ఆ పదవి దక్కలేదు.

అయితే దానికి మించి అన్నట్లుగా ఆయనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పోస్ట్ దక్కింది. పల్లాకు ఈ పదవి గోల్డెన్ చాన్స్ అని అంటున్నారు. ఆయన ఏపీలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభాతో బలమైన సామాజిక వర్గంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన చెందిన వారు.

ఈ సామాజిక వర్గానికి చెందిన వారు రాజకీయంగా కీలకంగా ఉన్నా రాజకీయ పార్టీలకు సారధ్యం వహించడం తక్కువ. అందులోనూ టీడీపీ వంటి మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహించడం అంటే గ్రేట్ అనే చెప్పాలి.

పల్లాకు ఇది అనుకోని అవకాశం అని అంటున్నారు. ఆయన ఈ అవకాశాన్ని వాడుకుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రముఖులలో ఒకరుగా నిలిచి పోతారని అంటున్నారు. మంత్రి పదవి దక్కితే ఆయన తన జిల్లాకే పరిమితం అయ్యేవారని అలా కాకుండా పార్టీ పదవి దక్కించుకోవడం సామాన్యం విషయం కాదని మొత్తం ఏపీ అంతా ఆయన పేరు మారుమోగుతుందని అంటున్నారు.

యువకుడు ఉత్సాహవంతుడు అయిన పల్లా శ్రీనివాస్ విద్యాధికుడు కూడా. కష్టపడి పనిచేసే తత్వం ఆయన సొంతం. అలాగే చురుకుగా వ్యవహరిస్తారు. నిబద్ధతతో పనిచేస్తారు ఇవన్నీ చూసే చంద్రబాబు ఆయనకు ఈ చాన్స్ ఇచ్చారని అంటున్నారు. పల్లా శ్రీనివాస్ మీద రానున్న రోజుల్లో ఎన్నో గురుతర బాధ్యతలు ఉన్నాయి.

తక్షణం ఆయన చేయాల్సింది మెంబర్ షిప్ డ్రైవ్. చంద్రబాబు అదే ఆయనకు చెప్పి ఆదేశించారు. యువతరాన్ని కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కించాలి. అలాగే వీలైనంతవరకూ బీసీలను బడుగులను ఇతర అణగారిన వర్గాలను పార్టీలోకి తీసుకుని రావాల్సి ఉంది.

మరో రెండేళ్లలో ఏపీలో లోకల్ బాడీస్ కి ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి ఘన విజయం దక్కేలా పల్లా చూడాల్సి ఉంది. ఏపీలో అన్ని రీజియన్లలోనూ ఈసారి టీడీపీకి ఘన విజయం దక్కింది. వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ అని చెప్పుకునే రాయలసీమ కూడా జేజేలు పలికింది. దాంతో అన్ని ప్రాంతాలలో ఇదే ఊపుని 2029 దాకా కొనసాగించాల్సి ఉంది.

ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా ఉండాలి. అలాగే ఉత్తరాంధ్రా ఏపీలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. మెగా సిటీ విశాఖ ఏపీకే గ్రోత్ ఇంజన్ గా ఉంది. ఆ సిటీ నుంచి వచ్చిన పల్లా అన్ని ప్రాంతాలను కలుపుకుంటూ సమగ్రమైన అభివృద్ధిని టీడీపీ ద్వారా సాధించే విషయంలో తన నాయకత్వ ప్రతిభను చూపించాల్సి ఉంది.

ఈ నెల 28న మంగళగిరి వేదికగా మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖుల సమక్షంలో పల్లా టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.ఆయన చేత చంద్రబాబు పదవీ ప్రమాణం చేయించబోతున్నారు. ఈ కార్యక్రమం తరువాత పల్లా తన సత్తా పూర్తి స్థాయిలో చాటుతారు అని ఆయన అనుచరులు అభిమానులు అంటున్నారు.

Tags:    

Similar News