బౌద్ధ గురువు ఆచూకీ కోసం.. చైనా - అమెరికా మ‌ధ్య 'వార్‌'

చైనా దేశంలో పాటించేది.. బౌద్ధ మ‌త‌మే. మెజారిటీ జ‌నాభా అనుస‌రించేది ఈ మ‌త‌మే

Update: 2024-05-20 04:00 GMT

చైనా దేశంలో పాటించేది.. బౌద్ధ మ‌త‌మే. మెజారిటీ జ‌నాభా అనుస‌రించేది ఈ మ‌త‌మే. ప్ర‌భుత్వం మా త్రం ఏ మ‌తానికీ ప్రోత్సాహం ఇవ్వ‌దు. అంతేకాదు, మ‌త ప్రాతిప‌దిక‌న ప్రాంతీయ త‌త్వాన్ని ప్రోత్స‌హించాల‌నే వారిపై చైనా కొన్ని ద‌శాబ్దాలుగా ఉక్కుపాదం మోపుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టిబెట్‌ను స్వ‌తంత్ర దేశంగా ప్ర‌క‌టించాల‌న్న‌.. బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు ద‌లైలామాను దేశం నుంచి త‌రిమి కొట్టారు. ప్ర‌స్తుతం ఆయ‌న భార‌త్ నీడ‌లో ఉంటున్నారు.

ఇక‌, ఇప్పుడు ఇలాంటి విష‌య‌మే మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. బౌద్దుల భావిగురువుగా భావించే 'పంచ‌న్ లామా' వ్య‌వహారం.. అమెరికా-చైనాల మ‌ధ్య వార్‌కు కార‌ణ‌మైంది. ఈయ‌న కూడా.. ద‌లైలామా వార‌సుడే. అయితే.. 29 ఏళ్ల కింద‌ట అప‌హ‌ర‌ణ‌కు గురైన ఈయ‌న ఇప్ప‌టికీ ఎక్క‌డ ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌దు. లామా భ‌క్తులు.. బౌద్ధ సంప్ర‌దాయులు మాత్రం చైనా ప్ర‌భుత్వమే పంచ‌న్‌ను అప‌హ‌రించింద‌ని.. ఆరోపిస్తారు.

కానీ, ఆయ‌న విష‌యంపై చైనా ప్ర‌భుత్వం ప‌న్నెత్తు మాట కూడా చెప్ప‌డం లేదు. అస‌లు అప్ప‌టి నుంచి కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ, తాజాగా అమెరికా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. పంచ‌న్ లామా అప‌హ‌ర‌ణ‌కు గురైన 29వ ఏటా.. దేశ‌వ్యాప్తంగా ఆయ‌న భ‌క్తులు ఆయ‌న‌కు పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని పుర‌స్క‌రించుకుని అమెరికా స‌ర్కారు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పంచ‌న్‌ సురక్షితంగా ఉన్నారా? లేరా? అన్న విషయాన్ని చైనా ఈ ప్ర‌పంచానికి చెప్పాల‌ని డిమాండ్ చేయ‌డం.. సంచ‌ల‌నంగా మారింది.

బౌద్ధ మ‌త గురువులలో పంచ‌న్ లామా 11వ గురువుగా భావిస్తారు. ఈయ‌న అసలు పేరు గెధున్ చౌకీ నీమా. చిన్న వ‌య‌సులోనే లామా గురువుగా ఆయ‌న మారారు. యుక్త వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత‌.. గురువుగా పూర్తి సేవ‌లు అందించాల్సి ఉంది. కానీ, ఇంత‌లోనే చైనా ద‌ళాలు ఆయ‌న‌ను 29 ఏళ్ళ కింద‌ట టిబెట్ లో అప‌హ‌రించాయి. అప్పటి నుంచి ద‌లైలామా కూడా.. త‌మ వార‌సుడిని చైనానే అప‌హ‌రించింద‌ని.. పేర్కొంటూ.. అన్ని దేశాల‌కు తిరుగుతూ ప్ర‌చారం చేశారు.

అయినా కూడా చైనా స్పందించ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా అమెరికా స‌వాల్ రువ్వింది.. పంచ‌న్ లామా ఆచూకీ మీరు చెబుతారా? మ‌మ్మ‌ల్నే తెలుసుకోమంటారా? అంటూ.. అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. దీనిపై చైనా కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. ఈ విష‌యంలో చైనాలోని అమెరికా రాయ‌బారికి తాజాగా స‌మ‌న్లు జారీ చేసింది. దీనిని త‌మ వ్య‌క్తిగ‌త అంశంగా పేర్కొంది. హ‌ద్దు మీరితే.. త‌గిన విధంగా స‌మాధానం చెబుతామ‌ని కూడా హెచ్చ‌రించింది. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News