కొండచరియల కింద ఊరు శిథిలం..పసిఫిక్ దేశంలో వందల ప్రాణాలు బలి

మరికొద్ది రోజుల్లో టి20 ప్రపంచ కప్ నకు అమెరికా-వెస్టిండీస్ దీవులు ఆతిథ్యం ఇవ్వనున్నాయి

Update: 2024-05-24 10:25 GMT

మరికొద్ది రోజుల్లో టి20 ప్రపంచ కప్ నకు అమెరికా-వెస్టిండీస్ దీవులు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీకి పపువా న్యూ గినియా (పీఎన్‌జీ) అర్హత సాధించింది. తూర్పు ఆసియా- పసిఫిక్‌ క్వాలిఫయర్‌ నుంచి వరల్డ్ కప్‌ కు అర్హత సాధించిన జట్టు పీఎన్ జీ ఒక్కటే. ఇలాంటి ఆనంద క్షణాల్లో ఉండగా.. ఓ పెను విషాదం జరిగింది. న్యూ గినీ ద్వీపం తూర్పు అర్ధ భాగంలో, ఆస్ట్రేలియాకు ఉత్తరంగా పసిఫిక్ మహా సముద్రానికి నైరుతి దిక్కున మెలనేషియా అనే ప్రాంతంలో కొన్ని దీవుల్లో విస్తరించి ఉన్న పపువా న్యూ గినియా ఓషియానియా భూభాగం దేశం. దీని రాజధాని ఆగ్నేయ తీరాన విస్తరించి ఉన్న పోర్ట్ మోర్స్‌ బై.

సముద్ర మట్టాలు పెరిగితే..

పీఎన్జీ ద్వీప దేశం. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్ లో సముద్ర మట్టాలు పెరిగితే కనుమరుగయ్యే ప్రమాదం ఉన్న దేశాల్లో ఇదీ ఒకటి. ఇలాంటిచోటకు రెగ్యులర్ విమాన సర్వీసులు కూడా ఉండవు. వారానికి ఒకటీ, రెండు అదీ ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి సర్వీసులు నడుస్తుంటాయి.

భిన్న సంస్కృతులు

పీఎన్ జీ అత్యంత భిన్న సంస్కృతులున్న దేశాల్లో ఒకటి. 4,62,840 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలో మూడో అతి పెద్ద ద్వీప దేశం. 1884 నుంచి మూడు వలస రాజ్యాలు దీనిని పరిపాలించాయి. 1975లో స్వాతంత్ర్యం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అరవై ఏళ్లపాటు ఆస్ట్రేలియా పాలనలో ఉంది. కాగా, పపువా న్యూ గినియా మారుమూల ప్రాంతంలో కొండ చరియలు బీభత్సం రేపాయి. అవి విరిగిపడడంతో 100 మందికి పైగా మరణించినట్లు ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపింది.

శిథిలాల కింద శవాలుగా..

రాజధాని పోర్ట్ మోర్స్‌ బైకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్‌ కావోకలం గ్రామంలో కొండచరియలు కూలాయి.

అయితే, తెల్లవారుజామున 3 గంటలకు, ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. కాగా, శిథిలాల కింద వందల మంది చిక్కుకోవడంతో గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు. అనేక ఇళ్లు పూర్తిగా నేలమట్టమై బండరాళ్లు, చెట్ల కింద కూరుకుపోయాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటివరకు 100 పైగా మృతదేహాలను వెలికి తీశారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News