డబ్బు, బీరు కోసం బిడ్డను అమ్మేశారు!!
డబ్బుల కోసం కన్న పిల్లలను అమ్ముకునే తల్లితండ్రులకు సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.
డబ్బుల కోసం కన్న పిల్లలను అమ్ముకునే తల్లితండ్రులకు సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పనులకు ఆ దేశం, ఈ దేశం అనే తారతమ్యాలేమీ లేవు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో ఓ జంట ఇదే పని చేసింది.. డబ్బుల కోసం తమ బిడ్డను అమ్మడానికి ప్రయత్నించింది.
అవును... డబ్బుల కోసం కన్న బిడ్డను అమ్మకానికి పెట్టింది ఓ జంట. వెయ్యి డాలర్ల (భారత కరెన్సీలో సుమారు 83వేలు) డబ్బు, బీర్ కోసం తమ పిల్లాడిని అమ్మడానికి ప్రయత్నించింది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారిని విక్రయించినట్లుగ రాసుకున్న లేఖను స్వాధీనం చేసుకున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలోని నార్త్ వెస్ట్ ఆర్కాన్సాస్ కు చెందిన డేరియన్ అర్బన్, షాలీన్ ఎహ్లార్స్ దంపతులకు మూడు నెలల బాబు ఉన్నాడు. అయితే... ఇటీవల వారు డబ్బు, బీర్ కోసం తమ బిడ్డను అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఓ వ్యక్తి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో చిన్నారి శరీరంలోని వివిధ భాగాలలో దద్దుర్లతో బాధపడుతున్నట్లుగా పేర్కొన్నారు.
దీంతో... అధికారులు ఆ చిన్నారిని తమ సంరక్షణలోకి తీసుకుని.. దగ్గరలోని పిల్లల ఆసుపత్రికి తరలించారు. అనంతరం చిన్నారి తల్లితండ్రులను కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ సమయంలో... తమ బిడ్డను అమ్మలేదని, వేరే జంటకు దత్తత ఇవ్వడానికి ప్రయత్నించినట్లు వారు చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో ఈ దత్తతకు సంబంధించిన అధికారిక పత్రాలను తీసుకోవాలని అనుకున్నట్లుగా పేర్కొన్నారు. అయితే వీరి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.