లేటుగా వెళ్లిన లేటెస్టుగా వ్యవహరించిన పవన్ కల్యాణ్
సుద్దగడ్డ వరద ముంపు బారిన పడిన పేదల ఇళ్లను సందర్శించిన పవన్.. తాను బురదలో నడిచే వేళలో కాళ్లకు చెప్పులు వేసుకోకుండా నడవటం గమనార్హం.
వెళ్లే విషయం కాస్త ఆలస్యం కావొచ్చు. కానీ.. ఒకసారి వెళ్లాలన్నది డిసైడ్ అయ్యాక మాత్రం వెనుకా ముందు ఆలోచించకుండా దూసుకెళ్లటం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లటం.. బాధితులను పరామర్శించటం లాంటి కార్యక్రమాలకు తాను హాజరైతే.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందన్న వాదనను వినిపించే పవన్.. తాజాగా మాత్రం కాకినాడ జిల్లా వరద ముంపు ప్రాంతమైన గొల్లప్రోలులో పర్యటించారు. సుద్దగడ్డ వరద ముంపు బారిన పడిన పేదల ఇళ్లను సందర్శించిన పవన్.. తాను బురదలో నడిచే వేళలో కాళ్లకు చెప్పులు వేసుకోకుండా నడవటం గమనార్హం.
సాధారణంగా వీఐపీలు.. అందునా డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉన్న నేతలు కాళ్లకు బూట్లు ధరించి నడుస్తుంటారు. బురదలో నడవటానికి కాస్త సంకోచిస్తారు.కానీ.. పవన్ అలాంటివేమీ పట్టించుకోలేదు. కాళ్లకు ఎలాంటివి వేసుకోకుండా బురదలో నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. కాలనీలోకి బోటులో వెళ్లే వేళలో.. సెక్యూరిటీ సిబ్బంది చెప్పగా.. లైఫ్ జాకెట్ ధరించిన పవన్.. అక్కడి నుంచి వరద నీటిలోనూ.. బురదమయంగా మారిన రహదారుల్లోనూ తిరిగి బాధితుల్ని పరామర్శించారు. వారు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.
చాలామంది తెలిసి తెలియకో బుడమేరు పరీవాహక ప్రాంతాలను ఆక్రమించి ఉంటారని.. అది ఆక్రమణ స్థలం తెలీక కొనుగోలు చేసిన వారున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వారందరితో కూర్చొని మాట్లాడితే బాగుంటుందన్న ఆయన.. నదులు, వాగులు, ఇతర పరీవాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలన్న పవన్.. ‘‘అనుకోకుండా వచ్చిన అకాల వర్షాలతో విజయవాడకు వరద పోటెత్తింది. దాని నుంచి కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. వరద బాధితుల్ని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం కొనుగోలు చేసిన పేదలకు పట్టాలిచ్చిన భూములపై ఆయన కీలక ఆరోపణలు చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వేళలో మాట్లాడిన ఆయన.. ‘‘జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారు.ఆ తప్పుల్ని కూటమి ప్రభుత్వం సరి చేయాలి. గొల్లప్రోలులో పేదల ఇళ్ల కాలనీ పేరుతో లోతట్టు ప్రాంతంలో నాడు 32 ఎకరాలు కొనుగోలు చేశారు. నాలుగు అడుగుల లోతులో ఉన్న ఈ ప్రాంతానికి మార్కెట్ ధర రూ.30 లక్షలు అయితే రూ.60 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేశారు. ముంపు ప్రాంతాల్లో గత ప్రభుత్వం స్థలాలు ఇవ్వటం వల్లే పేదలు ఇబ్బంది పడుతున్నారు’’ అని పేర్కొన్నారు. మొత్తంగా తన తాజా పర్యటనతో వరద ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోవటంతో పాటు.. తానుపరిష్కారం చూపుతానన్న భరోసాను ఇచ్చారు.