అక్కడ ఎన్డీయే కూటమికి మద్దతుగా పవన్
కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలకమైన మిత్రుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బీజేపీ నుంచి ఒక విన్నపం వచ్చింది.
కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలకమైన మిత్రుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బీజేపీ నుంచి ఒక విన్నపం వచ్చింది. తమకు ప్రాణ ప్రతిష్టగా మారిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ప్రచారం చేయమని బీజేపీ పెద్దలే నేరుగా పవన్ ని కోరారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవన్ ని ఢిల్లీ పిలిపించుకుని ఈ విషయం మీద డిస్కషన్ చేశారు.
పవన్ ఎన్నికల ప్రచారం చేయాలని కూడా ఆయన కోరారు. పవన్ అందుకు అంగీకరించారు. ఆయనకు వీలైన తేదీలు చెబితే ప్రచారం షెడ్యూల్ ని ఖరారు చేస్తామని కూడా బీజేపీ పెద్దలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలోని కొన్ని కీలకమైన ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
ఏపీ అసెంబ్లీ ఈ నెల 11న స్టార్ట్ అయింది. బడ్జెట్ మీద చర్చ ముగియగానే ఈ నెల 16 17 తేదీలలో రెండు రోజుల పాటు పవన్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని అంటున్నారు. ఆయన వెంట జనసేన నాయకుడు, మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ కూడా ఉంటారని తెలుస్తోంది.
ఇక పవన్ మహారాష్ట్రలో ఎన్డీయే తరఫున ప్రచారం చేయడానికి రెండు డేట్స్ ఇచ్చారు. ఈ నెల 20న మహారాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఈ నెల 18తో ఎన్నికల ప్రచారం అక్కడ ముగుస్తుంది. దాంతో ప్రచారానికి ముగింపునకు రెండు రోజులు ముందు పవన్ మహారాష్ట్రలో ఎంట్రీ ఇస్తే లాస్ట్ పంచ్ ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేస్తారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే రాజకీయ పార్టీలు అన్నీ ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఎవరికి వారుగా ఎన్నికల మ్యానిఫేస్టోని రిలీజ్ చేశాయి. ఇవన్నీ పక్కన పెడితే పవన్ బీజేపీ కోసం వేరే రాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఇదే మొదటి సారి. ఆయన గతంలో తెలంగాణలో కూడా బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం చేశారు. కానీ హిందీ బెల్ట్ లో అది కూడా అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీయే కూటమి ఢీ అంటే ఢీ కొడుతున్న మహారాష్ట్రలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం అన్నది మాత్రం చాలా విశేషంగా చెప్పాలి.
ఈ ఎన్నికల ఫలితాలు కనుక ఎన్డీయే కూటమికి ఆశాజనకంగా వస్తే మాత్రం ఎన్డీయేలో పవన్ ప్రాధాన్యత మరింతగా పెరుగుతుంది. అదే సమయంలో ఆయనను జాతీయ స్థాయిలో మరింతగా ఫోకస్ పెంచి బీజేపీ ఆయన సేవలను వాడుకుంటుందని అంటున్నారు. మొత్తానికి ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం చేసిన వారిలో నాడు అన్న గారు, ఆ తరువాత చంద్రబాబు అయితే ఇపుడు పవన్ కళ్యాణ్ వారితో పాటుగా ఉంటారని అంటున్నారు. పవన్ పొలిటికల్ కెరీర్ కి కూడా ఇది మరో మెట్టుగా మారుతుందని కూడా విశ్లేషణలు అయితే ఉన్నాయి.