దావోస్ లో పెట్టుబడుల వేటపై పవన్ కామెంట్స్ వైరల్..!
ఈ సమయంలో... గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన దావోస్ పర్యటనపై పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ & కో వరల్డ్ ఎకనమిక్ ఫారం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. సుమారు ఐదు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో.. బిల్ గేట్స్ తో పాటు పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో బాబు, లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
మరోపక్క దావోస్ టూర్ లో తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ సీఎంలతో భేటీ అయిన పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు... మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టుబడి పెట్టండి, మొత్తం మీద ఇండియాలో పెట్టండి అని కోరారని అంటున్నారు. దీంతో.. ఆ పారిశ్రామికవేత్తలు ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు భారీగా పెట్టడానికి ముందుకు రావడం గమనార్హం.
ఈ సందర్భంగా దావోస్ పర్యటనపై తాజాగా స్పందించిన చంద్రబాబు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... దేశంలో మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయించింది తానేనని.. 1997 నుంచి అక్కడకు వెళ్తున్నానని.. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నానని.. రాష్ట్రాన్ని మళ్లీ ప్రపంచపటంలో పెట్టడమే తన లక్ష్యమని అన్నారు.
ఇదే సమయంలో... రామాయపట్నంలో రూ.95 వేల కోట్ల పెట్టుబడులతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను బీపీసీఎల్ ఏర్పాటు చేయబోతోందని.. ఇదే సమయంలో.. అనకాపల్లి వద్ద 1.35 లక్షల కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ రాబోతోందని.. రూ.1.87 లక్షల కోట్లతో ఎంటీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతోందని.. గ్రీన్ అమ్మోనియా కూడా కాకినాడ నుంచి ఎగుమతి చేయనున్నామని సంచలన విషయాలు వెల్లడించారు.
అయితే... దావోస్ లో జరిగిన ఒప్పందాలపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఆధునిక ఆలోచనలు, ట్రెండ్స్ తెలుసుకునే అవకాశం కలుగుతుందని.. మొత్తంగా నెట్ వర్కింగ్ చేసుకోవచ్చని.. ఈసారి దావోస్ సదస్సుల్లో గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక అంశాలుగా మారాయని చంద్రబాబు అన్నారు.
ఈ సమయంలో... గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన దావోస్ పర్యటనపై పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్... "దావోస్ కి కోట్లు వేసుకుని వెళ్లినంత మాత్రాన్న పెట్టుబడులు రావాలని ఏమీ లేదు.. ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటే.. పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే.. విదేశాల నుంచి వెతుక్కుని వస్తారు" అని అన్నారు. దీంతో... ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుందని అంటున్నారు.