పవన్ ఢిల్లీ టూర్.. విషయం పెద్దదేనా.. ?
అయితే.. పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్‌లో ఏం చేశారన్నది ఇప్పుడు చర్చగా మారింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా ఢిల్లీకి వెళ్లారు.. ఆవెంటనే వచ్చారు. అయితే.. పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్‌లో ఏం చేశారన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే.. నాలుగు మాసాల పాలన తర్వా త.. అనూహ్యంగా పవన్ ఢిల్లీ టూర్ కు వెళ్లడం.. ఇలా వెళ్లి అలా వచ్చేయడం కూడా.. అనేక ప్రశ్నలకు తావిస్తోంది. పైకి.. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడలేదని.. కేవలం విష్ చేసేందుకు మాత్రమే వెళ్లానని చెప్పా రు.
అయితే.. ఎవరూ ఊరికేనే అయితే.. 2 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయరుకదా! నిజానికి విషెస్ చెప్పాల ని అనుకుంటే.. ఇంత రిస్క్ కూడా తీసుకోరు. కాబట్టి.. పవన్ కల్యాణ్ ఢిల్లీటూర్‌లో 'విషయం' అయితే ఉందనేది వాస్తవం. అయితే.. అది ఏంటి? అనేదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. వైసీపీ విషయంపై పవన్ కల్యాణ్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ తగాదాలు ఎలా ఉన్నా.. ఆస్తుల విషయంలో పవన్ సీరియస్‌గానే ఉన్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన భూముల విషయంలో ఆయన ఒక లైన్ తీసుకున్నారు. ఈ భూములను తీసుకుని 30 ఏళ్లు అయ్యాయని, ఇప్పటి వరకు కార్యకలాపాలు కూడా ప్రారంభించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూములపై రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుని.. వాటిని తిరిగి ఇచ్చిన వారికి కేటాయించాలనేది పవన్ ఉద్దేశంగా ఉంది. అయితే.. ఇది అంత తేలిక కాదు.
దీంతో ఈ విషయంలో కేంద్రం జోక్యాన్ని కోరేందుకు పవన్ ఢిల్లీ వెళ్లి ఉంటారన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో కేంద్రం నుంచి గ్రాంటుగా రావాల్సిన పంచాయతీ నిధుల విషయంలోనూ పవన్ తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుతం సహకార శాఖ మంత్రిగా అమిత్‌షానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి.. ఈ విషయాన్ని ఆయనతోనే చర్చించి, గ్రాంట్లు ఇచ్చేలా చర్యలు తీసుకునేందుకు కూడా ఈ పర్యటనను పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
అయితే.. రాజకీయం లేకపోతే నిధులు అనే విషయంలో సందేహం లేదు. అయితే.. నిధుల విషయంలో ఇప్పటికే చంద్రబాబు, నారా లోకేష్‌లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన దరిమిలా.. పవన్ అలా ఒత్తిడి చేయరన్నది కూడా పరిశీలనాంశం. కాబట్టి రాజకీయంగానే ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడిందని పరిశీలకులు చెబుతున్నారు.