ఆ మొక్కలు పెంచొద్దు.. పవన్‌ కీలక సూచన!

పర్యావరణానికి విఘాతం కలిగించే కోనో కార్పస్‌ మొక్కలను పెంచొద్దని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కీలక సూచనలు చేశారు.

Update: 2024-08-30 06:28 GMT

పర్యావరణానికి విఘాతం కలిగించే కోనో కార్పస్‌ మొక్కలను పెంచొద్దని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కీలక సూచనలు చేశారు. ఈ మొక్కల వల్ల చాలా నష్టాలు ఉన్నాయని తెలిపారు. అరబ్‌ దేశాలు కూడా కోనో కార్పస్‌ మొక్కలను పెంచడం లేదని తెలిపారు. అరబ్‌ దేశాలే కాకుండా మన దేశంలో తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అసోం రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కోనో కార్పస్‌ మొక్కలను నిషే«ధం విధించాయని గుర్తు చేశారు.

అరబ్‌ దేశాల్లో పచ్చదనం కోసం కోనో కార్పస్‌ మొక్కలను అక్కడ విరివిగా పెంచారని చెప్పారు. అయితే ఆ తర్వాత వాటి వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని తెలుసుకుని ఆ జాతి మొక్కలపై అరబ్‌ దేశాలు నిషేధం విధించాయని వెల్లడించారు.

కోనో కార్పస్‌ మొక్కల అనేక అనర్థాలు సంభవిస్తాయని పవన్‌ తెలిపారు. ఈ మొక్కలు భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగించుకుంటాయన్నారు. అంతేకాకుండా ఈ మొక్కలు ఉన్నచోట చుట్టుపక్కల ప్రజలకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయన్నారు.

కోనో కార్పస్‌ మొక్కలను పశువులు కూడా ముట్టవన్నారు. అలాగే పక్షులు కూడా గూళ్లను పెట్టుకోవడానికి వీటిని ఆశ్రయించవని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. క్రిమికీటకాదులు కూడా ఈ చెట్ల సమీపంలోకి రావన్నారు. పక్షులు, జంతువులే ముట్టుని మొక్కలను ప్రజలు పెంచడం సరికాదన్నారు. ప్రతి ఒక్కరూ కోనో కార్పస్‌ మొక్కలను నాటడం ఆపేయాలని సూచించారు. అందరికీ మేలు చేసే మొక్కలే మన నేస్తాలు అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. అన్య జాతుల మొక్కల పెంపకం చేపట్టొద్దని కోరారు.

వన మహోత్సవ దినాన్ని పురస్కరించుకుని పవన్‌ కళ్యాణ్‌ వీడియో సందేశం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలన్నారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం సామాజిక బాధ్యత అని చెప్పారు.

కాగా కొద్ది రోజుల క్రితం కోనో కార్పస్‌ మొక్కలను నరికేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జనవిజ్ఞాన సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ రెడ్డి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్లు ఇద్దరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మొక్కలతో మానవాళికి, పర్యావరణానికి హాని ఉందో, లేదో ముందు నిపుణుల కమిటీతో తేల్చాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోనో కార్పస్‌ మొక్కలను ఏ నిబంధనల ఆధారంగా కొట్టేస్తున్నారో వివరాలు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News