గిఫ్ట్ కార్డ్ మోసాలు... అమెజాన్ కు ఆర్బీఐ రూల్స్ గుర్తు చేసిన పవన్!
దీంతో... గతంలో తన కార్యాలయం కూడా ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని పవన్ గుర్తుచేసుకున్నారని అంటున్నారు.
అమెజాన్ వంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కనేనన్ని మోసాలు జరుగుతున్నాయనే చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎవరిని ఎలా సంప్రదించాలనే విషయంపై కొంతమందికి క్లారిటీ ఉన్నా.. సదరు సంస్థల నుంచి సరైన సమాధానలు వస్తాయనే విషయంపై మాత్రం ఎలాంటి గ్యారెంటీ లేదని అంటుంటారు.
ఈ వ్యవహారాలపై ఇప్పటికే చాలా మందికి స్వానుభవాలు ఉన్నాయని చెబుతున్నారు. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుని, గడువు తేదీలోగా సదరు కార్డులను వినియోగించుకోకపోతే ఇక అందులోని సొమ్ము మొత్తం హుష్ కాకి అయిపోతుంటుంది. దీనిపై బాధితుడు చెప్పేది వారికి అర్ధం అయినా, కాకపోయినా.. ఒకటే టైపులో కంప్యూటర్ జనరేటెడ్ సమాధానాలు వస్తుంటాయని చెబుతారు.
దీంతో.. చాలా మంది వినియోగదారులు బీపీలు తెచ్చుకుని టెన్షన్ పడుతుంటారు.. కోపపడినా ప్రయోజనం లేదని వారిలో వారే నలిగిపోతుంటారు! ఇలాంటి వ్యవహారాలు ఈ-కామర్స్ వినియోగదారులకు నిత్యకృత్యం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తరహా మోసాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
అవును.. ఇటీవల కాలంలో గిఫ్ట్ కార్డుల్లో జరుగుతున్న మోసాల విషయాన్ని పలువురు పవన్ దృష్టికి తీసుకొచ్చారట. దీంతో... గతంలో తన కార్యాలయం కూడా ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని పవన్ గుర్తుచేసుకున్నారని అంటున్నారు. తమ కార్యాలయాలకు సంబంధీంచిన గిఫ్ట్ కార్డుల్లోని బ్యాలెన్స్ మాయమైన విషయన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారని చెబుతున్నారు.
ఈ నేపథంలో.. ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇందులో భాగంగా... ప్రీపెయిడ్ పేమెంట్ ఇనిస్టిట్యూషన్స్ (పీపీఐ)లు ఇకపై నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని.. ఒక వేళ గిఫ్ట్ కార్డుల్లోని మొత్తాలను వినియోగదారులు గడువు తేదీలోగా వినియోగించుకోకపోయినా ఆయా మొత్తాలను పీపీఐలు మాయం చేయడానికి వీలు లేదని పవన్ తెలిపారు.
ఈ విషయంలో ఈ-కామర్స్ సంస్థలన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని పవన్ స్పష్టం చేశారు. గడువు లోగా సదరు వినియోగదారుడు ఆ కార్డులను వినియోగించుకోని పక్షంలో.. ఆ మొత్తాలను తిరిగి వారి వారి అకౌంట్స్ లో జమచేయాల్సి ఉంటుందని పవన్ సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.