ఒంగోలు కూటమిలో కొత్త రచ్చ... బాలినేనికి పవన్ కీలక ఆదేశాలు!!
అయితే.. వైఎస్ కుటుంబానికి బంధువైన బాలినేని పార్టీ మారడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనిపై స్పందించిన జగన్... "ఏముంది... ఒకరు పోతే ఇంకొకరు వస్తారు!" అంటూ లైట్ తీసుకున్నారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అయితే.. వైఎస్ కుటుంబానికి బంధువైన బాలినేని పార్టీ మారడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది కచ్చితంగా వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే అనే కామెంట్లు వినిపించాయి. ఇక పవన్ కల్యాణ్ ను కలిసిన సందర్భంగా స్పందించిన బాలినేని కూడా.. పవన్ పై ప్రశంసల వర్షం కురిపించారు! ఆ సంగతి అలా ఉంటే... బాలినేనికి ఇప్పుడు నియోజకవర్గంలో సెగ తగులుందని తెలుస్తోంది.
అవును... ఒంగోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీనేత బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరేందుకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ ని కలిసిన బాలినేని... ఈ నెల 26న ఆయన సమక్షంలోనే జనసేన కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. ఈ సమయంలో బాలినేనితో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు జనసేనలో చేరనున్నారని తెలుస్తోంది.
ఆ సంగతి అలా ఉంటే... బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన చేరికపట్ల నియోజకవర్గంలో కొత్త రచ్చ మొదలైంది! ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో పాటు జనసేనలోని రియాజ్ వర్గం కూడా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దానికి చాలా బలమైన కారణం ఉందని.. 2019-24 మధ్య నియోజకవర్గంలో కూటమి నేతల విషయంలో బాలినేని అనుసరించిన వైఖరే అందుకు కారణమని అంటున్నారట.
ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తొలి రెండున్నరేళ్లు బాలినేని మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలను బాలినేని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. ఇందులో కొంతమందిపై అక్రమ కేసులు కూడా బనాయించారని.. వాటి విషయంలో పలురు కూటమి నేతలు పోలీస్ స్టేషన్స్ చుట్టు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వాపోతున్నారట.
ఈ నేపథ్యంలో... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తన అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే భయంతోనే బాలినేని జనసేనలోకి వస్తున్నారని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తమపై అనుసరించిన వైఖరి తాము మరిచిపోలేమని కూటమిలోని కొందరు నేతలు, మెజారిటీ కార్యకర్తలు విమర్శిస్తున్నారన్ని తెలుస్తోంది. ఇది ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన పరిస్థితి.
ఈ నేపథ్యంలొనే... బాలినేని - దామచర్ల వర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిందనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది! ఇలా జనసేనలో చేరబోతున్న బాలినేని, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల వర్గీయుల మధ్య మాటల తూటాలు పేలుతున్న వేళ వీరి వ్యవహారం ఆ రెండు పార్టీల అధిష్టాణాలకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందించారని సమాచారం.
ఇందులో భాగంగా... నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఏదైనా సమస్యలు వస్తే అవి అధిష్టాణం దృష్టికి తీసుకురావాలే కానీ.. ఇలా బజారుకెక్కి జుట్లు పట్టుకొద్దరి అధినాయకత్వాలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయని అంటున్నారు. ఇక ప్రధానంగా... తాజా వివాదం నేపథ్యంలో బాలినేనికి పవన్ కల్యాణ్ పలు సూచనలు చేస్తూ, కొన్ని కండిషన్స్ పెట్టారని కథనాలొస్తున్నాయి.
ప్రధానంగా ఒక నియోజకవర్గం ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య.. రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల మధ్య సఖ్యత దెబ్బతినడానికి కారణం కాకూడదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో... జనసేనలో చేరే కార్యక్రమానికి పరిమితంగానే నాయకులను తీసుకురావాలని.. వీలైనంత తక్కువ హడావిడి చేయాలని పవన్ సూచించారని అంటున్నారు.
ఈ విషయంలో బాలినేనికి పవన్ కల్యాణ్ నుంచి పలు కండిషన్స్ కాస్త సీరియస్ గానే వచ్చినట్లు స్థానిక రాజకీయాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. కాగా... గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నేత బాలినేనిపై టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ రావు 34,026 ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.