లోకేష్ డిప్యూటీ సీఎం...పవన్ ఇమేజ్ కొండంతలుగా !
పవన్ ని ఏమైనా అంటే ఆయనకు అది తగలదు, వారికే గుచ్చుకుంటుంది. దాంతో పవన్ ని అల్లుకున్న వారు అంతా హర్ట్ అవుతారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెండి తెర మీద పవర్ స్టార్. ఆయన కోట్లాది మందికి ఆరాధ్యుడు. ఆయన ప్రజా జీవితంలోకి వచ్చాక ఒక బలమైన సామాజిక వర్గానికి ఆయన ఆశాకిరణంగా మారారు. పవన్ ని ఏమైనా అంటే ఆయనకు అది తగలదు, వారికే గుచ్చుకుంటుంది. దాంతో పవన్ ని అల్లుకున్న వారు అంతా హర్ట్ అవుతారు. మరింతగా పవన్ ని వారు హత్తుకుంటారు.
పవన్ రాజకీయ వ్యూహాల కంటే ఇదే ఆయనను ఈ రోజున ఉప ముఖ్యమంత్రి చెయిర్ లో కూర్చోబెట్టింది అన్నది ఒక రాజకీయ విశ్లేషణ. పవన్ కళ్యాణ్ అంటే చాలా మందికి నమ్మకంగా మారారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక కీలక సామాజిక వర్గానికి ఈ రోజుకీ ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. దాంతో వారంతా విసిగి వేసారి ఉన్నారు.
వారికి ఆలంబనగా పవన్ కనిపిస్తున్నారు. ఆయన ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి పీఠానికి అడుగు దూరంలో ఉన్నారని వారు తెగ సంబర పడుతున్నారు పవన్ తో కలసి మరింత సుదీర్ఘమైన ప్రయాణానికి కూడా వారు సిద్ధపడుతున్న వేళ ఆయన విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పెట్టే చర్యలు ఎవరు చేయాలనుకున్నా బెడిసికొడతాయి. అలగే బూమరాంగ్ అవుతాయని వర్తమాన రాజకీయ చరిత్ర నిరూపించింది.
అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పవన్ ని గట్టిగా టార్గెట్ చేశారు ఫలితం ఆయనే రివర్స్ కొట్టింది పవన్ ఇంకా బలంగా మారారు. ఆయన చుట్టూ బలమైన సామాజిక వర్గం అల్లుకుని పోయింది. ఆయనకు మేము కొండంత అండ అంటూ చాటిచెప్పింది. వైసీపీ తప్పుడు రాజకీయ వ్యూహాల ఫలితంగానే ఇంతటి భారీ మూల్యం చెల్లించుకుంది.
పవన్ ని ఒక వ్యక్తిగా లేక హీరోగా చూసుకుని లైట్ తీసుకుని వైసీపీ బొక్క బోర్లా పడింది. ఇక ఇపుడు చూస్తే టీడీపీ పవన్ బలాన్ని గట్టిగానే అంచనా వేసింది. అందుకే ఆయనతో జత కట్టింది. పొత్తు కుదుర్చుకుని మరీ కూటమిగా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. మరి పొత్తులో భాగంగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పవన్ ని ఏకైక ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పవన్ ఉప ముఖ్యమంత్రి. అలా సరి సమానంగా ఆయనకు విలువ గౌరవం దక్కుతున్నాయి.
ప్రతీ ప్రభుత్వ ఆఫీసులో ఆయన ఫోటో కూడా బాబు పక్కనే ఉంటోంది. దీంతో పవన్ చుట్టూ అల్లుకుని ఉన్న బలమైన సామాజిక వర్గం అలాగే అశేష విశేషమైన అభిమాన జనం కూడా పూర్తిగా సంతోషంగా ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే అందరికీ మేలుగా ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అంటూ తమ్ముళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయనను కూడా మరింతగా ప్రభుత్వంలో ఫోకస్ ఉండేలా చూడాలని అలా తీసుకుని రావాలని రాజకీయ రచ్చ చేస్తున్నారు.
అయితే దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి అయితే ఏ మాత్రం రియాక్షన్ లేదు. ఆయన ఏ విధంగా స్పందిస్తారు అని అంతా ఎదురుచూశారు. కానీ పవన్ మాత్రం నిమ్మళంగా ఉన్నారు. పైగా ఉప ముఖ్యమంత్రి రాజకీయ రచ్చ మీద ఎవరూ మాట్లాడవద్దంటూ తమ పార్టీ శ్రేణులను కట్టడి చేశారు. ఇది ఇలా ఉంటే నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి వ్యవహారం కాస్తా కూటమిలో కలకలం రేపడమే కాదు, రాజకీయ రచ్చను క్రియేట్ చేసింది.
దాంతో ఇదేదో వేరేగా మారుతోందని భావించిన టీడీపీ పెద్దలు అలెర్ట్ అయ్యారు. ఈ విషయం మీద ఎవరూ మాట్లాడవద్దు అంటూ హైకమాండ్ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడితో ఇష్యూ అయితే క్లోజ్ అయింది. కానీ ఈ టోటల్ ఎపిసోడ్ లో టీడీపీ తమ్ముళ్ళు ఏమి సాధించారు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.
లోకేష్ ఇమేజ్ ని పెంచారా లేక తగ్గించారా అంటే ఈ రెండూ కాదు మొత్తంగా పవన్ ఇమేజ్ నే కొండంతలు పెంచేశారు అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎలాగంటే పవన్ పాటించిన వ్యూహాత్మకమైన మౌనంతో పాటు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని చిన్న గీత గీసి పెద్ద గీత మరోటి గీయాలన్న ప్రయత్నం మీద ఆయనను అల్లుకున్న వర్గాలు కానీ అభిమాన జనాలు కానీ గుస్సా కావడమే కాదు మరింతగా దగ్గర అయిపోయారు.
ఈ ఎపిసోడ్ తో రెండు విషయాలు అయితే అర్ధం అవుతున్నాయని అంటున్నారు. ఒకటి ఏంటి అంటే కూటమి ప్రభుత్వంలో పవన్ డిప్యూటీ పొజిషన్ ని ఇసుమంత అయినా కదిలించడం కానీ తగ్గించడం కానీ అనుకున్నంత సులువు అయితే కాదు అని. అంతే కాదు పవన్ ని నమ్ముకున్న జనాలు ఆయన మీద మరింతగా ప్రేమను పెంచుకుని మద్దతుగా నిలవడం. పవన్ విషయంలో తెలిసి తెలిసి ఈ విధంగా తప్పులు చేస్తున్నారా అన్నదే ఇపుడు జరుగుతున్న చర్చ.