జనసేనలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు ?

బీజేపీ టీడీపీల నుంచి దక్కిన సపోర్ట్ కూడా జనసేనకు వరంగా మారింది.

Update: 2024-10-21 09:30 GMT

ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి జనసేనకు ఈసారి ఎన్నికల్లో ఆరు సీట్లు దక్కాయి. మొత్తం 32 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో అరడజన్ సీట్లను గెలుచుకోవడం అన్నది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. పొత్తులో ఇది సాధ్యమైంది. బీజేపీ టీడీపీల నుంచి దక్కిన సపోర్ట్ కూడా జనసేనకు వరంగా మారింది.

ఇక చూస్తే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకంగా నాలుగు సీట్లను జనసేన గెలుచుకుంది. అవి విశాఖ దక్షిణం, అలాగే పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి. విశాఖ దక్షిణం నుంచి వంశీ క్రిష్ణ శ్రీనివాస్ గెలిచారు. అలాగే పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్ గెలిచారు

ఇందులో పార్టీలో మొదటి నుంచి ఉన్నది సుందరపు విజయకుమార్ మాత్రమే. మిగిలిన వారు ఎన్నికల ముందు చేరిన వారు. ఇవన్నీ ఇలా ఉంటే పార్టీలో ఎవరైనా అవినీతి పనులు చేసినా బెదిరించినా తాను సహించేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేస్తూ వచ్చారు.

లేటెస్ట్ గా కూడా ఆయన మరోమారు ఇదే తరహాలో హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. అది కూడా విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల వైఖరి మీద పరోక్ష హెచ్చరికలుగా వీటిని చూడాలని అంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఏమి చేశారు, ఎందుకు పవన్ కళ్యాణ్ అటువంటి హెచ్చరికలు చేశారు అంటే ఆ ఎమ్మెల్యేల విషయంలో తనకు అందిన సమాచారం మేరకే ఈ విధంగా రియాక్ట్ అయ్యారు అని అంటున్నారు

మరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి ఏమేమి విషయాలు జనసేన అధినాయకుడిని చేరాయి అన్నది కనుక చూస్తే ఆ ఇద్దరూ తమ పరిధిలోని పారిశ్రామికవేత్తల విషయలు, పరిశ్రమల విషయంలో అతి జోక్యం చేసుకుంటున్న్నారు అని ఫిర్యాదులు అందాయని అంటున్నారు. అంతే కాదు వారి నుంచి పెద్ద మొత్తాలను ఆశిస్తున్నారు అని కూడా ఫిర్యాదులు నేరుగా అధినేత దాకా వచ్చాయని అంటున్నారు.

అయితే ఇలాంటి విషయాలలో జనసేన అధినేత మొదటి నుంచి చాలా కఠినంగా ఉంటున్నారు. ఆయన అవినీతికి కడు దూరం. ఆయన నిజాయితీగా ఉంటారు. పార్టీ వారిని అలాగే ఉండమంటారు. ఎవరైనా గీత దాటితే సహించేది లేదని మొదటి నుంచి ఆయన చెబుతూ వస్తున్నారు. అలా ఉన్న వారే తనతో ముందుకు నడుస్తారు అని ఆయన చెబుతూ వచ్చారు. గతంలో కూడా ఈ రకమైన ఆరోపణలు విశాఖ జిల్లా నుంచే వచ్చాయని అపుడు కూడా పవన్ హెచ్చరించారని అంటున్నారు.

ఈసారి మాత్రం ఆయన హెచ్చరికలతో పాటు అవసరమైతే తాను ఎవరిని అయినా వదులుకునేందుకు సిద్ధమని కూడా అంటున్నట్లుగా చెబుతున్నారు. పరిశ్రమలు వాటి యజమానుల విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోవద్దని పవన్ సిద్ధాంతం. ఏపీకి పరిశ్రమలు రావాలని వారిని సాదరంగా ఆహ్వానించాలన్నదే ఆయన ఆలోచన.

వచ్చిన వారిని వేధిస్తే పరిశ్రమలు ఎక్కడ నుంచి వస్తాయన్నది కూడా ఆయన ఆలోచిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇలాంటి పని చేసిన వారిని పట్టుకుని బాహాటంగానే విమర్శలు చేశారు. ఇపుడు తన పార్టీలో కూడా అలాంటి పోకడలు ఉండకూడదని పవన్ గట్టిగానే కోరుకుంటున్నారు అని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు ఏమిటి అన్నదే ఇపుడు హాట్ హాట్ గా సాగుతున్న డిస్కషన్. ముందే చెప్పుకున్నట్లుగా విశాఖ జిల్లాలో నలుగురు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఇద్దరు అంటున్నారు. అందునా పరిశ్రమలు ఉన్న చోట అని కూడా అంటున్నారు. అలా కనుక తీసి లెక్క వేసుకుంటే ఆ ఇద్దరు ఎవరో సులువుగానే తెలిసిపోతుందని అంటున్నారు.

ఇక అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన ఎంపీ పరిధిలో తరచూ పర్యటనలు చేస్తూ వస్తున్నారు. ఆయన అన్ని అసెంబ్లీ సీట్లలోనూ తిరుగుతున్నారు. ఆయనకు ఈ ఫిర్యాదులు వస్తే అధినాయకత్వం చెవిన ఏమైనా వేశారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. మొత్తం మీద చూస్తే జనసేనలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మీద అయితే డిస్కషన్ సాగుతోంది. మరి వారు ఎవరు ఏమిటి అన్నది విశాఖ జిల్లా రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి ఈపాటికి అర్ధం అయ్యే ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News