ఉమ్మడిగా బాబు, పవన్‌.. పక్కా ప్లాన్‌ అందుకే!

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వేర్వేరుగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం నిర్వహించారు.

Update: 2024-04-08 04:37 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు సంకుల సమరాన్ని తలపిస్తున్నాయి. ఓవైపు అధికార వైసీపీ సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకుని ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. వివిధ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. రాష్ట్రానికి రాజధాని లేదని, పోలవరం పూర్తి కాలేదని, అభివృద్ధి అనేది లేదని, ఒక్క పేరున్న కంపెనీ కూడా జగన్‌ పాలనలో రాలేదని.. ఇవన్నీ పూర్తి కావాలంటే తమ వల్లే అవుతుందని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నారు. అభివృద్ధి కావాలంటే తమకు పట్టం కట్టాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వేర్వేరుగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభ, టీడీపీ, జనసేన రెండు పార్టీల పొత్తు తర్వాత తొలిసారి నిర్వహించిన తాడేపల్లిగూడెం సభ మినహా చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి సభలు నిర్వహించింది లేదు. ప్రస్తుతం ఇద్దరు నేతలు విడివిడిగా సభలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కూటమి భారీ ఆశలు పెట్టుకున్న కోస్తాంధ్రలో కలిసికట్టుగా ప్రచారం చేయాలని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 10న తొలి సభను పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో భారీ ఎత్తున నిర్వహించడానికి ఇరు పార్టీల నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభతోపాటు రోడ్‌ షోలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏప్రిల్‌ 10న నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పాల్గొననున్నట్లు ఇరు పార్టీల నాయకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకులో రోడ్డు షో నిర్వహించి.. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.

ఏప్రిల్‌ 10నే నిడదవోలు, ఏప్రిల్‌ 11న పి.గన్నవరం, అమలాపురంల్లోనూ రోడ్‌ షోలు, భారీ బహిరంగ సభలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నిర్వహించనున్నారు. వీటితోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు, రోడ్‌ షోలను ఇద్దరు నేతలు కలిసికట్టుగా నిర్వహిస్తారని చెబుతున్నారు.

ఉభయ గోదావరి రెండు జిల్లాల్లోనే 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే 5 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అందులోనూ జనసేనకు గట్టి పట్టుగా నిలుస్తున్న సామాజికవర్గం ఈ రెండు జిల్లాల్లో అత్యధికంగా ఉంది. అలాగే టీడీపీకి బలంగా నిలుస్తున్న సామాజికవర్గం సైతం ఈ రెండు జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ సంయుక్తంగా ప్రచారం చేస్తే అత్యధిక స్థానాలను కొల్లగొట్టవచ్చని ఆ రెండు పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల అధినేతలు సంయుక్త ప్రచారాలకు తెరలేపనున్నారు.

Tags:    

Similar News