ఇద్దరు మొదటిసారి కలుస్తున్నారా ?
ఆ బహిరంగసభ నిర్వహణలో స్ధానిక జనసేన నేతలు, క్యాడర్ కూడా ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మొదటిసారి ఇద్దరు కలవబోతున్నారు. అదేమిటి ఇద్దరు చాలాసార్లు భేటీ అయ్యారు కదా మొదటిసారి కలవటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఇద్దరు మొదటిసారి కలవబోతోంది బహిరంగసభలో. టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో మొట్టమొదటి బహిరంగసభ ఈనెల 17వ తేదీన భీమిలీ నియోజకవర్గంలో జరగబోతోంది. దీనికి సందర్భం ఏమిటంటే లోకేష్ యువగళం పాదయాత్ర 17వ తేదీన భీమిలిలో ముగియబోతోంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో భీమిలీలో భారీ బహిరంగసభ జరగబోతోంది.
ఆ బహిరంగసభ నిర్వహణలో స్ధానిక జనసేన నేతలు, క్యాడర్ కూడా ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం. అందుకనే లోకేష్ పాదయాత్ర ముగింపు బహిరంగసభలో చంద్రబాబుతో పాటు పవన్ కూడా పాల్గొనబోతున్నారు. అంటే వీళ్ళిద్దరు పాల్గొనే మొదటి బహిరంగసభ భీమిలీ సభే అవుతుంది. ఈ రూపంలో భీమిలీ బహిరంగసభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మామూలుగా అయితే లోకేష్ పాదయాత్ర 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు జరగాలి. కుప్పంలో మొదలైన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగియాలి.
అయితే పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో ఉండగా చంద్రబాబు అరెస్టయ్యారు. దాంతో పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. అప్పుడు బ్రేకులుపడిన యువగళం మళ్ళీ రెండునెలల తర్వాత మొదలైంది. అందుకనే పాదయాత్రను బాగా కుదించేశారు. ఈనెల 6వ తేదీన పాదయాత్ర అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలోకి ఎంటరవుతోంది. ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో నుండే భీమిలీలోకి ఎంటరవుతుంది. అందుకనే భీమిలీలో ముగింపు సభను ఏర్పాటుచేసింది. బహిరంగసభ ఏర్పాట్లను రెండుపార్టీలు కలిసే చూస్తున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు.
రెండుపార్టీలు కలిసి బహిరంగసభను ఏర్పాటుచేస్తున్నట్లుగానే ప్రచారం జరుగుతోంది. నిజానికి అచ్చంగా టీడీపీ బహిరంగసభే అయినా జనసేన నేతలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందుకనే ఈ బహిరంగసభకు చంద్రబాబు, పవన్ ఇద్దరూ హాజరవుతున్నారు. కాబట్టే మొదటిసారిగా ఇద్దరు కలిసి పాల్గొటున్నట్లు చెప్పింది. కాబట్టి రెండు పార్టీల ఆధ్వర్యంలో జరగబోయే మొదటి బహిరంగసభ ఎలా జరుగుతుందో చూడాలి. దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఎలాగుంటుందో అంచనా వేసుకోవాల్సిందే.