పవన్, చంద్రబాబు భోగి మంటలు!

వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలుపుపై ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ధీమాతో ఉన్నారు.

Update: 2024-01-14 04:19 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలుపుపై ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ధీమాతో ఉన్నారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఇద్దరు నేతలు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు పోటీ చేయాల్సిన సీట్లు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఇరు పార్టీల అధినేతలు జనవరి 13న ఉండవల్లిలోని చంద్రబాబు ఇంట్లో సమావేశమయ్యారు. మూడున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు.

ఇందులో భాగంగా జనవరి 14న రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో నిర్వహించిన భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సందడి చేశారు. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగు జాతికి స్వర్ణయుగం–సంక్రాంతి సంకల్పం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా తొలుత చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లకు రెండు పార్టీల శ్రేణులతో పాటు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ భోగి మంటలు వెలిగించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలకు సంబంధించిన జీవోలను, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుజాతి పెద్ద ఎత్తున నిర్వహించుకునే పండుగ సంక్రాంతి అని గుర్తు చేశారు. రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తో కలిసి పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తు మనదేనని తెలిపారు. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుందని తేల్చిచెప్పారు.

తనకు ఒకవైపు బాధ ఉందని.. మరోవైపు కోపం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారని వాపోయారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది అని హెచ్చరించారు. కాగా మూడు రోజులపాటు ‘రా కదలిరా’ కార్యక్రమానికి టీడీపీ, జనసేన పార్టీలు పిలుపు నిచ్చాయి.

Tags:    

Similar News