పవన్ కి అదే ప్లస్ అవుతుందా...వైసీపీ ఆరోపణల మాటేంటి...?
విశాఖలో పవన్ నాయకత్వాన జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ తన మాటలను కచ్చితంగా నమ్మాలని ప్రజలకు సభా ముఖంగా వినతి చేసుకున్నారు.
పవన్ పదేళ్లలో ఏమి చేశారు. కనీసం వార్డు మెంబర్ అయినా అయ్యారా. ఇవీ వైసీపీ నుంచి వచ్చే విమర్శలు. పవన్ పార్టీ పెట్టి ఒక్క చోట కూడా గెలవలేదు, ఆయన పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమిని చవిచూశారు. ఇది కూడా ఆయన మీద బలమైన ఆరోపణే.
అయితే ఇవే ఆరోపణల మీద తన భవిష్యత్తు రాజకీయ జీవితాన్ని పటిష్టంగా పవన్ నిర్మించుకోబోతున్నారు. తనలో ఉన్న పొలిటికల్ స్టామినాకు, తన పట్టుదలకు, రాజకీయాల మీద తన నిబద్ధతకు, ప్రజల మీద ప్రేమ మమకారానికి ఈ పదేళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఒక నిదర్శనం అని పవన్ అంటున్నారు.
విశాఖలో పవన్ నాయకత్వాన జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ తన మాటలను కచ్చితంగా నమ్మాలని ప్రజలకు సభా ముఖంగా వినతి చేసుకున్నారు. నేను మాటకు ఇచ్చే విలువ ఏమిటి అన్నది నా రాజకీయ జీవితం చూస్తే మీకే అర్ధం అవుతుంది అని పవన్ అంటున్నారు. నాది పదేళ్ళ పోరాటం, పార్టీ పెట్టి ఇన్నేళ్ళు గడచినా నేను ఎక్కడా వెరవలేదు, వెనక్కి తగ్గలేదు, ప్రజల కోసం నాకున్న ఆకాంక్షలకు ఈ పదేళ్ళ పోరాటం అచ్చమైన ఉదాహరణా అని పవన్ అంటున్నారు.
నేనే కనుక రాజకీయాల మీద ప్రజల మీద ఆసక్తి లేకపోతే ఇన్నేళ్ళ పాటు కొనసాగి ఉండేవాణ్ణి కాదు, అందరి చేత తిట్లు తినేవాణ్ణి అంతకంటే కాదు అని పవన్ అన్నారు. నేను చెప్పాను అంటే చేస్తాను అని పవన్ ప్రజలకు మాట ఇచ్చారు. ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ పధకాలు అన్నీ కూడా ప్రజల సొమ్ముతోనే ఇస్తున్నవే. ఎవరి జేబులో నుంచి కానే కాదు అని పవన్ అన్నారు.
అంతే కాదు మనది సంక్షేమ రాజ్యం, ఆదేశిక సూత్రాలలోనే అది ఉంది. అందువల్ల ఎవరి వచ్చినా ఈ పధకాలు కంటిన్యూ అవుతాయి. ఇంకా ఇంతకు ప దింతలు మేము ఈ పధకాలను అమలు చేసి చూపిస్తామని పవన్ అన్నారు. నన్ను నమ్మండి, నా పొలిటికల్ ట్రాక్ రికార్డు చూడండి అని ఆయన కోరుతున్నారు. నేను ఎపుడూ మాట ఇస్తే తప్పే నైజం ఉన్న వాడిని కాదని ఆయన అన్నారు.
ఇక ఏపీలో జగన్ దిగిపోతే పధకాలు అన్నీ పోతాయని జరుగుతున్న ప్రచారం అసలు నమ్మవద్దు అని పవన్ కోరారు ఈ విషయంలో ఎవరేమి చెప్పినా జనసేన అధికారంలోకి వస్తే పేదల కోసం పధకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతుందని ఆయన హామీ ఇచ్చారు.
మొత్తానికి చూస్తే పవన్ పదేళ్ళ రాజకీయ జీవితమే రేపటి ఆయన నిబద్ధతకు, మాట ఇస్తే కట్టుబడి ఉంటారన్న దానికి నిదర్శనంగా చూడాలని జనసైనికులూ అంటున్నారు. సాధారణంగా గెలుపు ఉన్న చోటనే ఎవరైనా ఉంటారు. కానీ ఓటమి ఎదురైనా పార్టీని కొనసాగిస్తూ వస్తున్న పవన్ తాను అసలైన ప్రజా పక్షం అని చెబుతున్నారు. మరి పవని మీద వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలే ప్లస్ అవుతాయా అంటే ఏమో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో 2024 లో తేలనుంది అని అంటున్నారు.