పవన్‌ పోటీ అక్కడి నుంచే.. ఇదే రుజువు!

ఈ కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశం ఉండటంతో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో పవన్‌ చర్చలు జరపనున్నారు.

Update: 2024-02-19 10:38 GMT

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో సీట్ల కేటాయింపుపై పలుమార్లు పవన్‌ కళ్యాణ్‌ చర్చలు జరిపారు. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశం ఉండటంతో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో పవన్‌ చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై స్పష్టత రానుంది.

కాగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో పవన్‌ విశాఖపట్నం జిల్లాలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ పవన్‌ కళ్యాణ్‌ రెండు చోట్ల పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. ఇందులో భాగంగా పిఠాపురం, తిరుపతి, అవనిగడ్డ, కాకినాడ రూరల్‌ తదితర స్థానాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే పవన్‌ గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం నుంచే మరోసారి బరిలోకి దిగుతారని టాక్‌ నడుస్తోంది. ఓడిన చోటే గెలుపొందాలనే లక్ష్యంతో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారని అంటున్నారు.

ఇందులో భాగంగానే భీమవరంలో ఉండటానికి పవన్‌ ఇల్లు కూడా చూస్తున్నారని చెబుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే జనసేన నేతలకు ఆయన ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో జనసేన నేతలు పవన్‌ కళ్యాణ్‌ కోసం ఇల్లు వెతికే పనిలో ఉన్నారని అంటున్నారు.

మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ భీమవరం పర్యటన కూడా ఖరారైందని తెలుస్తోంది. ఫిబ్రవరి 20న ఆయన భీమవరం వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితి, పోటీ చేసే అభ్యర్థులు, ప్రత్యర్థి పార్టీ బలాబలాలను తెలుసుకుంటున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ భీమవరం నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. అక్కడ ఇల్లు తీసుకోవాలని చూస్తుండటమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మరోవైపు వైసీపీ తరఫున గ్రంథి శ్రీనివాస్‌ భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే మరోసారి పోటీ చేసే వీలుంది.

2019 ఎన్నికల్లో పవన్‌ 5 వేలకు పైగా ఓట్ల తేడాతో భీమవరంలో ఓడిపోయారు. రెండో స్థానంలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు మూడో స్థానంలో నిలిచారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన పొత్తు ఉండటంతో టీడీపీ అభ్యర్థి బరిలో ఉండే అవకాశం లేదు. దీంతో జనసేన, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదు.

Tags:    

Similar News